తెలంగాణ: డియస్సీ ప్రశ్నల పునరావృతంపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ..?

FARMANULLA SHAIK
తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ ఈ ఏడాది మెగా డీఎస్సీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప‌రీక్ష నిర్వ‌హించిన విషయం తెలిసిందే. గత వారంలో ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రాథ‌మిక కీ ని కూడా విడుద‌ల చేసింది. ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాల స్వీకరణకు.. ఆగస్టు 20వ తేదీతో గడువు కూడా ముగియనుంది. అనంతరం ఫైనల్‌ కీ విడుదల చేసి.. ఈ వారంలోనే ఫలితాలను సైతం విడుదల చేసే అవకాశం ఉంది.ఈసారి టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి సెప్టెంబరు 5వ తేదీన‌ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కసరత్తులు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో టీఎస్ డీఎస్సీ-2024 ఫ‌లితాల‌ను ఈ వారంలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్లను నియమించాలనే ఉద్దేశంతో ఉన్న తెలంగాణ‌ సర్కార్.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ పూర్తయిన వెంటనే ఫైనల్ కీని రిలీజ్ చేసి.. అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టును ప్రకటించనున్నారని సమాచారం. ఈ లెక్కన చూస్తే ఈ వారంలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫ‌లితాలు విడుద‌లైన వెంట‌నే.. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆ వెంటనే నియామక పత్రాలు అందజేయనున్నారు.ఈ ఏడాది తెలంగాణ ప్ర‌భుత్వం మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు.. 182 పీఈటీలు.. 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు.ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ కూడా ఇటీవల విడుదలైంది. అయితే ఆన్సర్‌ కీలో పలు ప్రశ్నలకు సమాధానలు తప్పుగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

రైట్‌ టూ ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌’కు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా ఈ చట్టం ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినది ఆన్సర్‌ కీలో సమాధానం వచ్చింది. ప్రతిష్టాత్మకమైన డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా ఈ ప్రశ్నకు ఆప్షన్లుగా ఆర్టీఐ యాక్ట్‌, ఆర్సీఐ యాక్ట్‌, ఆర్టీఈ యాక్ట్‌, ఆర్‌పీడబ్ల్యూడీ యాక్ట్‌ అని ఇచ్చారు. వాస్తవానికి ఒక్క ఆర్టీఐ యాక్ట్‌ తప్ప మిగతా చట్టాలన్నింటిని ప్రత్యేకావసరాలు గల వారి కోసం రూపొందించారు. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఆర్‌పీడబ్ల్యూడీ యాక్ట్‌ ఈ ప్రశ్నకు సరైన సమాధానంగా ఇచ్చారు. ఇది తప్పు అని అభ్యర్థులతోపాటు నిపుణులు ఆరోపిస్తున్నారు. అలాగే ADHD పూర్తి రూపం ‘అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజాస్టర్‌’ కాగా, బదులుగా మాస్టర్‌ ‘కీ’లో మాత్రం ‘ఆటో డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజాస్టర్‌’ సరైన సమాధానంగా ప్రకటించారు.ఇలాగే డీఎస్సీ ప్రశ్నపత్రాల్లో ఒకే పేపర్‌లో ఏకంగా 18 వరకు తప్పులున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(స్కూల్‌ అసిస్టెంట్‌) పరీక్ష మాస్టర్‌ ‘కీ’లో 160 ప్రశ్నలకు ఇచ్చిన ప్రాథమిక కీలో అత్యధిక తప్పులున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రశ్నపత్రం రూపకల్పనపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో-4 ప్రకారం ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క లర్నింగ్‌ డిసెబిలిటీలో 35 వరకు ప్రశ్నలిచ్చినట్లు చెబుతున్నారు. తెలుగు గ్రేడ్‌-1 పరీక్ష ‘కీ’ లోనూ 5 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చినట్లు అభ్యర్ధులు వాపోతున్నారు. కాగా డీఎస్సీ ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’పై అభ్యంతరాలు గుర్తిస్తే.. వాటిని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది.

అభ్యంతరాలు లేవనెత్తడం ద్వారా సరైన సమాధానాన్ని సూచించవచ్చు. ఇందుకు ఆగస్టు 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అవసరమైతే మెయిల్‌ లేదా ఫోన్‌ చేయవచ్చునంటూ విద్యాశాఖ ఇప్పటికే మెయిల్‌ అడ్రస్‌లతో పాటు, ఫోన్‌ నంబర్లను ఇచ్చింది.
ఈ నేపథ్యంలో అభ్యంతరాలపై సబ్జెక్టు ఎక్స్ పర్ట్ కమిటీ సమీక్షించి, ఈ నెలాఖరులోనే ఫైనల్ కీ, ఆ వెంటనే రిజల్ట్స్ విడుదల చేసే చాన్స్ ఉంది. వచ్చేనెల మొదటివారంలో జిల్లాల వారీగా పోస్టులు, వివిధ మీడియంలలో మెరిట్ లిస్టులు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తున్నది.రేషియాలో వచ్చే నెల రెండోవారంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పండిట్, పీఈటీ కేటగిరీలో ఒక్కోపోస్టుకు ముగ్గురుచొప్పున సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పిలుస్తారు.గత నెల19న ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్షలో, అదే నెల23న సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్షలో సోషల్ సబ్జెక్టులోని ప్రశ్నలన్నీ ఒకేరకంగా ఉన్నాయి. అయితే, ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఇబ్బందులు ఏమీ ఉండవని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. పక్కపక్కన జిల్లాలకూ వేర్వేరు రోజుల్లో జరగడంతో కలిసి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు క్వశ్చన్లు తెలిసే చాన్స్ ఉంది. అయితే, జిల్లాలు వేర్వేరు కావడంతో పాటు పేపర్ బయటకు రాదు కాబట్టి సమస్య ఏమీ ఉండదని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: