కొట్టేద్దాం జాబ్‌: గ్రూప్‌1, గ్రూప్‌2 ఒకేసారి ప్రిపేర్ అవ్వొచ్చా?

తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేయడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్‌పై దృష్టి సారించారు. అయితే.. ఉద్యోగార్ధుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. గ్రూప్‌1, 2, 3,4 ఇలా నాలుగు కేటగిరీల ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు ఏ ఉద్యోగానికి ప్రిపేర్‌ కావాలి.. ఏ ఉద్యోగాన్ని ఎంచుకోవాలి.. ఏ అభ్యర్థులకు ఏది సూటబుల్.. ఒకేసారి రెండు, మూడు పరీక్షలకు ప్రిపేర్ కావచ్చా.. అది మంచి పద్దతే అవుతుందా.. అన్న అనుమానాలు ఉద్యోగార్థులను వేధిస్తున్నాయి.

ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు ఇస్తామని.. ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఇస్తామని చెబుతున్నా.. అది నమ్మశక్యంగా లేదు. అందువల్ల అభ్యర్థులు తమ టాలెంట్‌, సమయంపై స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్‌ 1 అనేది విశ్లేషణాత్మకమైన పరీక్ష.. ఒక అంశాన్ని విశ్లేషించి సొంతంగా రాయగల నైపుణ్యం ఉన్నవారికి గ్రూప్ 1 అనేది సులభం అవుతుంది. గ్రూప్‌ 2 అనేది.. ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష.. ఇక్కడ విశ్లేషణ సామర్థ్యం కంటే.. జ్ఞాపకశక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

ఎక్కువగా మెమరీ పవర్ ఉండి.. ప్రతి బిట్ గుర్తు పెట్టుకోగలం కానీ.. మేం.. విశ్లేషించి రాయలేం అనుకునేవారికి గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం మంచిది. గ్రూప్‌ 2కు కేవలం ఒకే విడత పరీక్ష ఉంటుంది.. కానీ.. గ్రూప్ 1కి ప్రిలిమినరీ, మెయిన్స్ రెండూ ఉంటాయి. అయితే.. గ్రూప్ 1కు ప్రిలిమినరీ సిలబస్ అంతా కూడా గ్రూప్‌ 2లో దాదాపు కవర్ అవుతుంది. అందువల్ల గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వాళ్లకు గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ సాధించడం సులభం అవుతుంది.

అలాగే.. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవారు.. గ్రూప్ 2 కూడా రాయొచ్చు. కానీ.. ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. అందుకే అభ్యర్థి ముందుగా తాను ఏ పరీక్ష రాయాలి.. తన బలాలు, బలహీనతలు ఏంటి అన్న విషయంపై స్వయంగా బేరీజు వేసుకోవాలి.. లేదా.. అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకుని ఏదో ఒక ఉద్యోగానికి గురి పెట్టడం వల్ల లక్ష్యాన్ని సాధించడం సులభం అవుతుంది. ఈ విషయంలో ఆచితూచి ఆలోచించిన నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయమే మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందన్నది మరిచిపోకూడదు. ఆల్‌ ద బెస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: