ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌: మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులు!?

N.Hari
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఒకవైపు ఒమిక్రాన్, మరోవైపు డెల్టా వైరస్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ సభలు, సమావేశాలపై ఆంక్షలు పెట్టిన సర్కారు... విద్యాసంస్థల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి 10 రోజుల పాటు సెలవులు ప్రకటించిన సర్కారు.. ఆ తర్వాత మళ్లీ బడులు తెరిపిస్తుందా? లేక రోజురోజుకు పెరుగుతున్న కేసుల దృష్యా సెలవులను పొడగించుకుంటూ పోతుందా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
డెల్టా వేరియంట్ నుంచి కోలుకొని విద్యావ్యవస్థ పూర్తి స్థాయిలో గాడిన పడగా.. మరోసారి ఒమిక్రాన్ రూపంలో భారీగా ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో దాదాపు ఈ ఏడాది 40 లక్షల మంది విద్యార్థుల్లో 95 శాతం మంది ప్రత్యక్ష బోధనకు హాజరు అవుతున్నారు. అయితే గడిచిన మూడు రోజులుగా ఫిజికల్ క్లాసులకు అటెండ్ అయ్యే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రతి పాఠశాలలో కేవలం 10 శాతం మంది విద్యార్థులు మత్రమే ఆన్ లైన్ క్లాసులు వింటుంగా.. రెండు రోజులుగా దాదాపు 40 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే తరగతులు వింటున్నారని, ఒమిక్రాన్ భయంతో తరగతి గదులకు రావడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి.
మరోవైపు పేరెంట్స్ సైతం కరోనా కేసులు పెరుగుతుండటంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేసులు పెరుగుతుంటే చూస్తూ చూస్తూ పాఠశాలలకు పంపలేమని, ఫిబ్రవరి చివరి వరకు ఆన్‌లైన్ పెట్టాల్సిందేనని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా సమయంలో చదువులు అటకెక్కినా... తమ పిల్లల ప్రాణాలు సైతం ముఖ్యమంటూ పేరెంట్స్‌ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి సెలవుల పేరిట పది రోజుల పాటు బడులను బంద్‌ పెట్టిన సర్కారు.. ఆ తర్వాత సెలవులను పొడిగించేందుకు అవకాశం లేకపోలేదు. దీంతో విద్యా సంస్థలు మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభిస్తున్నాయి.
మొత్తంమీద ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో మరోసారి విద్యావ్యవస్థ గందరగోళంలో పడింది. సెకండ్ వేవ్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే విద్యార్థులు ప్రత్యక్ష పాఠాలు వింటుండగా... మరోసారి బడి బంద్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో తరగతి గదులకు పంపేందుకు పేరెంట్స్ జంకుతున్నారు. మరి సర్కారు.. సంక్రాతి సెలవుల తర్వాత యథావిధిగా బడులను తెరుస్తుందా? లేక కొంతకాలం పాటు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు మొగ్గు చూపుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: