తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల

Garikapati Rajesh

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వ‌విద్యాల‌యం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 127 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వ‌విద్యాల‌యంలో సీనియర్ అసిస్టెంట్ విభాగంలో 15 ఖాళీలు, ఇదే విశ్వ‌విద్యాల‌యంలో జూనియర్ అసిస్టెంట్ విభాగంలో మరో 10 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో వెల్ల‌డించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యంలో 102 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలను సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు ఏమేంటంటే..
అభ్యర్థుల‌కు డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్ లో ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థలో డిప్ల‌మో  ఉండాలి లేదా బీసీఏ డిగ్రీ ఉండాలి లేదా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు విభాగంలో డిగ్రీ  ఉండాలి.  టైప్ రైటింగ్ ఇంగ్లిష్ లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు  జూలై 1 నాటికి 18-34 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. PWD అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఎంపిక విధానం
రాత పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అబ్జెక్టివ్‌ టైప్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు ప‌రీక్ష‌ ఉంటుంది. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ కు సంబంధించిన ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. సెక్రటేరియట్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో 150 ప్రశ్నలుంటాయి. ఆంగ్ల‌, తెలుగు భాషల్లో ఈ ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్ అప్లికేషన్ ప్రశ్నలు మాత్రం ఆంగ్లంలోనే ఉంటాయి.
ద‌ర‌ఖాస్తు చేసే విధానం
అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో ఆన్లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12 న ప్రారంభం కానుంది. మే 5 చివ‌రితేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 5వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని నోటిఫికేష‌న్‌లో సూచించారు. ఇంకెందుకు ఆల‌స్యం..  ఇప్ప‌టినుంచే ప్రిప‌రేష‌న్ మొద‌లుపెట్టేయండి!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: