లైక్స్ కోసం లైఫ్ రిస్క్? బైకర్ స్టంట్ వీడియోపై సోషల్ మీడియా ఆగ్రహం...!

Amruth kumar
సోషల్ మీడియా పుణ్యమా అని ఈ రోజుల్లో ఫేమస్ అవ్వడం కోసం జనం ఎంతటి సాహసానికైనా తెగిస్తున్నారు. రీల్స్ పిచ్చిలో ప్రాణాలను పణంగా పెడుతూ, మృత్యువుతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఒక బైకర్ చేసిన స్టంట్ చూస్తుంటే నెటిజన్లకు వెన్నులో వణుకు పుడుతోంది. "ఇసొంటి పనులు వద్దనేది అందుకే.. ఇది స్టంట్ కాదు, నేరుగా యముడికి పంపిన అపాయింట్‌మెంట్ లెటర్" అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సెలబ్రిటీ అయిపోవాలని ఆరాటపడుతున్నారు. అయితే ఆ ఆరాటం కాస్తా ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక యువకుడు చేసిన పని చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. రాత్రి సమయంలో హైవేపై వేగంగా వెళ్తున్న ఒక భారీ ట్రక్కును టార్గెట్ చేసిన సదరు బైకర్, చేసిన విన్యాసం ఇప్పుడు చర్చనీయాంశమైంది.



వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక ప్రధాన రహదారిపై రాత్రి వేళ ఒక భారీ ట్రక్కు అత్యంత వేగంతో దూసుకెళ్తోంది. సరిగ్గా అదే సమయంలో ఒక యువకుడు హెల్మెట్ కూడా లేకుండా తన బైక్‌తో ఆ ట్రక్కును వెంబడించాడు. అంతటితో ఆగకుండా, ట్రక్కు డ్రైవర్ పక్కకు వెళ్లి ఏదో సైగలు చేశాడు. ఆ తర్వాతే అసలైన 'మూర్ఖత్వం' మొదలైంది.బైకర్ తన బైక్‌ను ఏకంగా దూసుకెళ్తున్న ట్రక్కు కిందకు, అంటే రెండు టైర్ల మధ్యలోకి తీసుకెళ్లాడు.ట్రక్కు వేగం ఏమాత్రం తగ్గినా.. లేదా పెరిగినా.. ఆ బైకర్ అక్కడికక్కడే నలిగిపోయేవాడు. రెప్పపాటు కాలంలో ప్రాణాలు పోయే అవకాశం ఉన్నా, ఆ యువకుడు మాత్రం దాన్ని ఒక ఫీట్‌లా ఫీలవుతూ బైక్ నడిపాడు.



ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవ్వగానే నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. "కేవలం కొన్ని లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఇంత రిస్క్ అవసరమా?" అని ప్రశ్నిస్తున్నారు."వీడు గత జన్మలో బల్లి అయి ఉంటాడు.. అందుకే అలా దూరిపోయాడు" అని ఒకరు సెటైర్లు వేస్తే.."వీడికి చావు మీద భయం లేదు, కానీ ఆ ట్రక్కు డ్రైవర్ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఏమైనా జరిగితే ఆ అమాయకుడు జైలుకు వెళ్లాలా?" అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు."వీడిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి.. ఇలాంటి వీడియోలను ప్రోత్సహించకూడదు" అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.


ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు చేసే సమయంలో అనుకోని ప్రమాదాలు జరిగి ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనకు తెలుసు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురుచూస్తుంటే, ఈ యువత మాత్రం ఇలాంటి పిచ్చి వేషాలతో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.ఈ వీడియో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్‌లు రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రోడ్లు అనేవి ప్రయాణానికి తప్ప, ఇలాంటి విన్యాసాలకు స్టేజీలు కావని స్పష్టం చేస్తున్నారు.



బైక్ నడపడం ఒక కళ.. కానీ దాన్ని మృత్యుక్రీడగా మార్చడం మూర్ఖత్వం. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి స్టంట్ వెనుక ఎంతో ప్రాక్టీస్ ఉంటుంది, లేదా అవి గ్రాఫిక్స్ అయి ఉంటాయి. కాబట్టి ఇలాంటివి చూసి ఇంట్లో ఉండే యువత వాటిని అనుకరించవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

నీ రీల్స్ కోసం పది లైక్స్ వస్తాయేమో గానీ.. ప్రాణం పోతే నీ కుటుంబానికి మిగిలేది కన్నీళ్లు మాత్రమే! హెల్మెట్ ధరించండి.. క్షేమంగా ప్రయాణించండి!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: