మహిళలపై అత్యాచారాలకు కారణం వారు తమ సామాజిక బాధ్యతను "పార్ట్-టైం లేదా నో-టైం" గా మార్చేయటమే!
కుటుంబంలో పెద్దలంటే పిల్లలతో సహా పిన్నలకు భయభక్తులు ఉండేవి. నాటి పెద్దలు పిల్లలను దేనికి బడితే దానికి దండాన్ని ప్రయోగించే వాళ్ళు కాదు. ఎక్కడ ఎలా నియంత్రించాలో నాటి పెద్దలకు తెలుసు.
నేడు ఇల్లాలు పోస్టు 'పార్ట్-టైంగా' మారటం, కొన్నిసార్లు ఆ "పార్ట్ టైం కూడా పోయి నో-టైం" గా మారి కుటుంబ సభ్యులపై నియంత్రణ లేక పోవటంతో - ఆ 'వేకెన్సీ' వలన ఆ కుటుంబ వ్యవస్థ కాస్తా అవస్థల పాలై ఎన్నో అనర్ధాలు మొదలై, కుటుంబం సమస్యల వలయంలో చిక్కుకుంటుంది.
నేటి సమాజమునకు దైవభక్తి లేదు. దేవుడంటే భయం మాత్రమే. తలిదండ్రులు తమబిడ్డలకు దైవభక్తి నేర్పించక పోవడం వలన తాము చేసే ప్రతిపనికి లెక్క ఉంటుంది కనుక మనస్సాక్షిని కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానమును కలిగియుండడం లేదు. దేవునికిని, మనస్సాక్షికిి భయపడని పురుషుడు తన తల్లి, తోడబుట్టిన అక్కచెల్లెండ్రు మరియు కడుపున కన్న కుమార్తెను కూడా భోగ విలాస వస్తువుగా చూడగలడు. అట్టి పురుషులు మాత్రమే పశువులను మించిన వాంఛలతో స్రీలను బలాత్కారము చేయగలరు.
స్రీలు పురుషులను బలాత్కారము చేసే వ్యవస్థ ప్రకృతిలో లేదు. నేటి విద్యావ్యస్థ, సామాజిక మరియు సాంస్కృతిక వ్యవస్థలలో మనుష్యులకు సృష్టికర్తకు భయపడాలని నేర్పించే విధానము లేదు. స్వేచ్ఛపేరిట విశృంఖలత మనుష్యులను కొండచిలవలా చుట్టేస్తుంది. మిడి మిడి జ్ఞానాంధకారంలో యువత కొట్టుమిట్టాడుతోంది.
భావప్రకటన స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ పేరిట మనుష్యుల హృదయములోని విషపూరిత హానికారక దుర్గంధము సమాజమంతటా వెదజల్లబడు తున్నది. ఈ పరిస్థతికి పైన చెప్పబడిన కారణములన్నీ వాటి వాటి పాత్రలను ఇతోధికరముగా పోషిస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా సత్యము మారదు.
అందుకే నేడు స్త్రీలు కూడా "వివాహేతర సంబంధ కారణము" ల చేత తమ భర్తలను చంపిస్తున్న సంఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా స్త్రీల మీద జరుగుతున్నఅత్యాచారాలతో, పలు దురంతాలకు బాధ్యత వహించాల్సింది మన కుటుంబంలో "సరైన ఇల్లాలు పదవు" లను తృణప్రాయంగా వదిలెయ్యటమే. నిర్లక్ష్యంగా చూడటమే.
ఈ సమాజం నేడు అనుభవిస్తున్న దుస్థితికి కారణం అదే అని చెప్పక తప్పదు. పురుషులలో ఈ సాంఘిక కౄరత్వం జనించటానికి ఆపై ప్రజ్వరిల్లటానికి కారణమైన దుష్కృత్యాల నివారణకు సామాజిక నైతిక సూత్రాలను నేర్పవలసిన అవసరం ఉంది. అందుకే నీతిసంబంధ శాస్త్రం విద్యా బోధనలో భాగం కావలసిన ఆవశ్యకత ఎంతో ఉంది.
కఠిన చట్టముతో పాటు సమాజ వికాసమునకు కావలసిన ధర్మ, న్యాయ, చట్టబద్ద నియంత్రణలో భయ భక్తులను నేర్పించే విద్యాసాంస్కృతిక విధానములు ఈ సమాజము అనుసరించక తప్పని పరిస్థితులను కల్పించాలి. లేకుంటే ఈ సమాజం ఇలాగే అఘోరిస్తుంది.
మన దేశంలో అత్యాచారాలు జరగని రోజు లేదు. పత్రికల్లో ప్రతి రోజు నాలుగైదు అత్యాచారాల వార్తలు కనబడుతూనే వుంటాయి. టీవీ పెడితే అత్యాచార వార్తలు కనబడుతూ వినబడుతూ ఉంటాయి. ఛానెళ్లలో ప్రముఖులతో, తల్లిదండ్రులతో, మేధావులతో చర్చా కార్యక్రమాలు జరుగు తుంటాయి. సామాజిక మాధ్యమాల సంగతి సరేసరి. ఎన్ని చర్చలు జరుగుతున్నా, ఎంతటి మేధోమథనం జరుగుతున్నా, ఎందరో ఎన్నోవిషయాలు మాట్లాడుతున్నా అత్యాచారాలకు కారణమేమిటి? అనేది తెలియడంలేదు.
ఇక్కడ మరి విచిత్రమైన విషయం ఏమంటే అత్యాచారాలు జరగకుండా చూడటానికి ఎవరికి తోచిన సలహాలు, సూచనలు వారు ఇస్తున్నారు. కాని ఒకరు చెప్పిన దాంతో ఇంకొకరు ఏకీభవించరు. ఈ చర్చల్లోకి స్వామీజీలు కూడా ఎంటరవుతున్నారు. సామాజిక కార్యకర్తలు వస్తున్నారు. మహిళా సంఘాలు, మేధావులు వస్తున్నారు. అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని, మరింత కఠిన చట్టాలు తేవాలని అంటుంటారు శాశ్వత పరిష్కారం ఎవ్వరూ చెప్పలేరు.
నిజానికి ఒక నిర్దిష్ట కారణమంటూ లేదు కదా! అత్యాచారాలకు బలవుతోంది నిరక్షరాస్యులు, గ్రామీణులు,పేదవారే కాదు, బాగా చదువుకున్న వారు, సంపన్నులు, ఉద్యోగాలు చేస్తున్నవారూ ఉన్నారు. కఠిన శిక్షలు విధిస్తామని ప్రభుత్వాలు ఎంతగా హెచ్చరిస్తున్నా, చట్టాలకు పదును పెడుతున్నాఅత్యారాలు ఆగడం లేదు. ఇదో "వైరస్" లా దేశమంతా పాకిపోయింది.
యువతులు, మహిళల మీదనే కాకుండా, అభం శుభం తెలియని నెలల పిల్లల మీద కూడా దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారంటే ఏం కారణాలు చెబుతాం? ఇది సామాజిక ఉన్మాదం అనుకోవాలా? కొందరు ఆధునిక టెక్నాలజీయే అత్యాచారాలకు కారణమంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్-ఫోన్లను నిందిస్తున్నారు. రకరకాల ఫీచర్లతో, ఆధునిక హంగులతో ఉన్నసెల్-ఫోన్లు అత్యాచారాలకు కారణమంటున్నారు.
మరి ఇంత హాని కలిగిస్తున్న స్మార్ట్-ఫోన్ లను నిషేదించటం సాధ్యం కాదు. వాటిపై నిషేధాలు విధించ గలరా? అదీ సాధ్యం కాదు. చివరకు అటుతిరిగి ఇటుతిరిగి తల్లిదండ్రులే పిల్లల్నిసరైనదార్లో పెట్టాలంటున్నారు. పోర్న్-వెబ్ సైట్లు అత్యాచారాలకు కారణం అంటున్నారు. సాంకేతికతను మన సమాజ పురోగమనానికి ఉపయోగించాలిగాని - తిరోగమనానికి ఉపయోగించటం ఎందుకు?
చట్టసభల్లో గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలే సమావేశాలు జరుగుతున్నప్పుడే తమ ఫోన్లలో పోర్న్ వీడియోలు చూసిన సందర్భాలు ఉన్నాయి. మరి జాతికి వారేమి సందేశం ఇవ్వగలరు. పిల్లలకు వారేం చెప్పగలరు? ప్రభుత్వాలు పోర్న్-సైట్లు పూర్తిగా నిషేధించడం లేదు. ఇక అత్యాచారాలు జరగడానికి సినిమాలు కారణమని కొందరు అంటున్నారు. దీన్ని సినిమా వారు అంగీకరించడం లేదు. సమాజంలో జరిగేదే తాము చూపిస్తున్నామని, అత్యాచారాలకు సినిమాలకు సంబంధ లేదని అంటున్నారు.
ఈ కారణాలన్నీ ఒక ఎత్తయితే, యువతులు, మహిళల వస్త్రధారణ కూడా అత్యాచారాలకు కారణమవుతోందని కొందరు అంటున్నారు. వస్త్రధారణ గురించి ఎవరైనా ప్రస్తావిస్తే మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. కొందరు స్వామీజీలు, నాయకులు వస్త్రధారణ హుందాగా లేకపోతే అత్యాచారాలు జరగడానికి ఆస్కారముందంటున్నారు.
మహిళా సంఘాలు దీన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన సందర్భాలు అనేకం. ఇష్టమైన వస్త్రధారణ చేసుకునే స్వేచ్ఛ లేదా? అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడం లేదని, అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళలు అంటున్నారు.
దిశఘటన నేపథ్యంలో తెలంగాణకు చెందిన మంత్రి 'ప్రతి ఇంటికీ పోలీసును పెట్టలేము కదా!' అని చేసిన వ్యాఖ్యలమీద తీవ్రవిమర్శలు చెలరేగాయి. ఈ కాలంలో ఆడ పిల్లలు చదువుకునే పరిస్థితి లేదని, మహిళలు ఉద్యోగాలు చేయాలంటే భయపడుతున్నారు అని కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడ పిల్లలను చదువులకు, ఉద్యోగాలకు బయటకు పంపడం కంటే ఇంట్లో ఉంచుకోవడమే మంచిదని కొందరంటున్నారు. ఇంతకూ అత్యాచారాలకు కారణమేమిటి?
తిరిగి భూమి గుండ్రంగా ఉంటుందన్నట్లు - అమ్మ- నాన్న- గురువు అంటూ మొదటికే వస్తుంది. నాగరిక సమాజ జ్ఞానం, గృహం నుండే మొదలు అవుతుంది. అక్కడ జ్ఞాన ప్రదాతలు అమ్మనాన్నలు. సమాజంలో మెలగటం, నడవడిక తదితర అంశాలను విద్యాబుద్ధులతో నేర్పించే తోలివ్యక్తి బాధ్యత మరవని ఉపాధ్యాయుడు. సమాజంలో స్త్రీలపై జరిగే ప్రతి అకృత్యానికి కారణం. తల్లి తండ్రితో కూడిన కుటుంబం-ఉపాధ్యాయునితో మొదలయ్యే సమాజం. ఇక్కడ తల్లి పాత్ర మొదలయ్యేది "ఇల్లాలు" స్థానం నుండే. ఓ మహిళా ముందు మీరు ఇలాలుగా మారండి - సమాజాన్ని మీ ఇంటి నుండే నిర్మించండి