ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే!!

Kavya Nekkanti
ప్ర‌పంచ‌దేశాల్లోనూ కంటికి క‌నిపించ‌ని క‌రోనా మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అగ్ర‌రాజ్యాలు సైతం అల్ల‌క‌ల్లోలం అయిపోతున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా కాటుకు ఏడు ల‌క్ష‌ల‌కు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంత మంది క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని మృత్యువాత ప‌డాలో అర్థం కావ‌డం. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే వేలాది మంది ఉద్యోగం కోల్పోయి రోడ్డున ప‌డుతున్నారు.

అయితే ఇలాంటి స‌మ‌యంలో హైద‌రాబాద్ ప్ర‌ధానకేంద్రంగా ఉన్న ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఉద్యోగాలు భ‌ర్తీ చేసేందుకు సిద్ధం అయింది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ ఆర్టిజన్‌ పోస్టులున్నాయి. వీటి వివ‌రాలు ఇలా ఉన్నాయి. మొత్తం 25 ఖాళీల్లో.. టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌ - 9, సైంటిఫిక్ అసిస్టెంట్‌ - 8, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌ - 1 మ‌రియు జూనియ‌ర్ ఆర్టిజన్‌ - 7 పోస్టులు ఉన్నాయి. విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. పోస్టును అనుస‌రించి సంబంధిత ట్రేడుల్లో/ స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్‌), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అలాగే కనీసం ఏడాది అనుభవం ఉండాల‌ని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు.. ఆగస్టు 31, 2020 నాటికి టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, మిగిలిన వాటికి 25 ఏళ్లు మించకూడద‌ని తెలిపింది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ పోస్టుల‌కు ఎంపిక విధానం ఉంటుంది. వేతనం వివ‌రాలు చూస్తే.. టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులకు నెలకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.19,864, జూనియ‌ర్ ఆర్టిజన్ పోస్టులకు రూ.18,070 ల‌భిస్తుంది. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం అయింది. అప్లై చేయ‌డానికి ఆగస్టు18, 2020 చివ‌రి తేది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఈ నోటిఫికేష‌న్ పూర్తి వివరాల కోసం :https://careers.ecil.co.in/login.php వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: