కేసీఆర్ వర్సెస్ రేవంత్.. అసెంబ్లీలో హై ఓల్టేజ్ యాక్షన్..!
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కాబోతోంది. దాదాపు రెండేళ్లుగా శాసనసభకు దూరంగా ఉన్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సోమవారం అసెంబ్లీకి హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య అసెంబ్లీ వేదికగా ముఖాముఖి పోరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలకు, రాజకీయ విశ్లేషకులకు ఇది అత్యంత ఆసక్తికరమైన పరిణామం.
రేవంత్ రెడ్డి సవాల్ - కేసీఆర్ రిప్లే ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచీ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. "ప్రతిపక్ష నేతగా బాధ్యత మర్చిపోయి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, దమ్ముంటే సభకు వచ్చి ప్రాజెక్టులపై చర్చించాలి" అని రేవంత్ విసిరిన సవాల్‌ను కేసీఆర్ స్వీకరించినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ రాకతో సభలో కేవలం చర్చలే కాకుండా, పదేళ్ల పాలన వర్సెస్ ఏడాది పాలన మధ్య యుద్ధం జరగడం ఖాయం.
చర్చకు రానున్న కీలక అంశాలు :
కేసీఆర్ సభకు వస్తే ప్రభుత్వం ఆయనను ఇరకాటంలో పెట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ నివేదిక, కృష్ణా జలాల వాటాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తమకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ అమలులో వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
రాజకీయ హోదా - ప్రజాక్షేత్రంలో పోరాటం :
రేవంత్ రెడ్డిని నేరుగా ఢీకొనడం తన స్థాయికి తక్కువని కేసీఆర్ భావిస్తారనే ప్రచారం గతంలో ఉండేది. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, ప్రతిపక్ష నేతగా తన గొంతు వినిపించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కేసీఆర్ అసెంబ్లీని ఒక వేదికగా వాడుకోనున్నారు. సభలో కేవలం మాటల యుద్ధం జరిగితే ప్రయోజనం ఉండదు. ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల వినియోగంపై సమగ్రమైన చర్చ జరిగితేనే ఎవరిది తప్పో ప్రజలకు స్పష్టత వస్తుంది.
ఒకవేళ కేసీఆర్‌ను సస్పెండ్ చేయడమో లేదా ఆయన సభ నుంచి వాకౌట్ చేయడమో జరిగితే, అది రాజకీయంగా ఇద్దరికీ నష్టం కలిగించవచ్చు. ఇద్దరు అగ్రనేతలు సభలో ఉండి వాదోపవాదాలు చేసుకుంటేనే తెలంగాణ ప్రజలకు నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. సోమవారం కేసీఆర్ రాకతో తెలంగాణ అసెంబ్లీ సభా నాయకుడు రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మధ్య జరిగే 'మైండ్ గేమ్' రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పబోతోంది. ఈ పోరులో ఎవరు నెగ్గుతారు? ఎవరు ప్రజల మనసు గెలుచుకుంటారో వేచి చూడాలి.