
గుజరాత్ వర్సెస్ తెలంగాణ.. మోడీకి రేవంత్ రెడ్డి సవాల్?
ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ దేశంలోనే ముందువరుసలో ఉందన్నారు. అంతే కాదు.. గుజరాత్ మోడల్ కు కాలం చెల్లిందని.. ఇప్పుడు తెలంగాణ మోడలే నడుస్తోందని అన్నారు. గుజరాత్ నమూనా కాలం చెల్లిన నమూనా.. గుజరాత్ మోడల్ ఇజ్ అవుట్ డేటెడ్ మోడల్.. అది టెస్ట్ మ్యాచ్ మోడల్... తెలంగాణది 20-20 నమూనా.. తెలంగాణ నమూనానే దేశానికి నమూనా. గుజరాత్ నమూనాలో ఏవిధమైన సంక్షేమం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నించిందేనన్న సీఎం రేవంత్ రెడ్డి.. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్ మార్కెటింగ్‌కు ఎవరైనా అంబాసిడర్ ఉన్నారా? లేరా? మోదీనే సొంతంగా గుజరాత్ కోసం పోరాడుతున్నారు... మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి.. ప్రధానమంత్రి దేశంలో ఏమూలకైనా పెట్టుబడులు వస్తే వాటికి ఆయన మద్దతు ఇవ్వడం లేదు. ఎవరైనా దేశానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తే గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టమని చెబుతున్నారు... ఇదేం పద్ధతి అని అన్నారు.
తెలంగాణది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా అని వివరించిన రేవంత్ రెడ్డి... ఈ మూడు మా ప్రాధాన్యాంశాలు.. అహ్మదాబాద్.. హైదరాబాద్ లోని మౌలిక వసతులను పోల్చి చూడండి.. మా హైదరాబాద్‌లో ఉన్న వసతులు.. అహ్మదాబాద్‌లో ఉన్న వసతులు చూడండి. హైదరాబాద్‌తో పోటీ పడే ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్‌లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా..? గుజరాత్‌లో ఏం ఉంది? నేను అహ్మదాబాద్, ముంబయి, బెంగళూర్, ఢిల్లీతో పోటీ పడడం లేదు.. నేను న్యూయార్క్, సియోల్, టోక్యో తో పోటీపడాలనుకుంటున్నాం. మా తెలంగాణ నమూనాతో ఎవరూ పోటీ పడలేరని అన్నారు.
మేం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి.. 30 వేల ఎకరాల్లో అద్భుతమైన నగరం నిర్మించే పని ప్రారంభించాం… అయిదేళ్ల తర్వాత వచ్చి చూడండి… ప్రపంచంలో అత్యుత్తమ నగరం నిర్మించబోతున్నామని తెలిపారు.