పాపం కేకే సర్వే..? అన్నీ గురి తప్పుతున్నాయి గా?
దిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ ముగిసిన తర్వాత అనేక సర్వే సంస్థలు బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. ఆప్ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేశాయి. అయితే వీటికి భిన్నంగా కేకే సర్వే తమ అంచనాలు వెల్లడించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 90 శాతం అక్యూరసితో అంచనాలు చెప్పి అందరినీ ఆశ్చర్చపర్చిన కేకే సర్వే యజమాని కిరణ్‌కొండేటి ఢిల్లీలో విఫలమయ్యాయి.
ఏపీ అసెంబ్లీ ఫలితాల తర్వాత కేకే సర్వేపై చాలా మందికి నమ్మకం పెరిగింది. కూటమి ప్రభుత్వం 160కి పైగా సీట్లతో అధికారంలోకి వస్తుందని స్పష్టంగా చెప్పారు. ఈ సర్వేను అందరూ లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 151 సీట్లు సాధించిన వైసీపీ 15 సీట్లకు రావడం ఏంటనే చర్చ నడిచింది. కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలైంది. దీంతో కేకే సర్వే పేరు మారు మోగిపోయింది. ఈ స్థాయిలో పేరు సంపాదించుకున్న కేకే సర్వే సంస్థ దిల్లీ ఎన్నికల్లో చతికిల పడింది. దిల్లీ పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని సర్వే సంస్థలు బీజేపీ వైపు చెబుతుంటే..
కేకే మాత్రం ఆప్ కు అనుకూలంగా చెప్పారు. దీంతో ఈ సర్వేను అన్ని ఛానళ్లు ప్రముఖంగా ప్రస్తావించారు. దీంతో పొలిటికల్ ఎనలిస్టులు కూడా కొంత సందిగ్ధంలో పడ్డారు. కానీ ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వెలువడ్డాయి. అయితే ఇతర రాష్ట్రాల ఫలితాలు అంచనా వేయడంలో కేకే సర్వే విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. హర్యానా ఎన్నికల్లో కేకే సర్వే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. బీజేపీ 48 స్థానాల, కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి.
తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేకే సర్వే అంచనా వేసింది. ఈ ఎన్నికల్లోనూ ఆప్ భారీ విజయం సాధిస్తుందని వెల్లడించారు. ఆప్ కనీసం 48 స్థానాల్లో గెలుస్తుందని ప్రకటించారు. బీజేపీ 21 స్థానాల నుంచి 24 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపారు. కానీ, వాస్తవ ఫలితాల్లో అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. గతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా కేకే సర్వే అంచనా వేసింది. అయితే ఈ అంచనాలు ఫలితాలకు కాస్త దగ్గరగానే వర్చాయి.