
సబ్ ఎడిటర్లు.. జర్నలిస్టులు కారా.. విలేకరుల ఆధిపత్యంలో అన్యాయానికి గురవుతున్నారా ?
- ఈసారి నుంచి డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు కూడా ఉండవని ప్రచారం?
- ఖమ్మం స్తంభాద్రి హౌసింగ్ సొసైటీలో వారికి చోటి ఇవ్వకపోవడమే నిదర్శనమా?
- వరంగల్ నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటులోనూ ఇదే తీరు
( దక్షిణ తెలంగాణ ఇండియా హెరాల్డ్ ప్రత్యేక ప్రతినిధి )
జర్నలిజం.. ఇది ఒక ప్యాషన్.. ఒక వ్యసనం.. ఈ జర్నలిజం వృత్తిని నమ్ముకొని ఎంతోమంది బతుకు వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా సంస్థల నుంచి వేతనాలు సక్రమంగా లేకపోయినా.. జర్నలిజం పై తమకున్న ఆసక్తితో కష్టాలు ఎన్ని ఎదురైనా.. నష్టాలు కుంగదీస్తున్న.. అనారోగ్య సమస్యలు ఎదురవుతున్న వాటన్నిటినీ అధిగమించి యాజమాన్యాలు విధించే నిబంధనలను పాటిస్తూ.. అర్ధరాత్రి వేళల్లో సబ్ ఎడిటర్లు పనిచేస్తుంటారు. వీరిని డెస్క్ జర్నలిస్టులని అంటారు. ఉదయాన్నే మనం లేవగానే చదివే దినపత్రికల్లో కనిపించే ఆ అక్షరమాలలు.. శీర్షికలు.. వీరు పెట్టేవే. ఉదయం నుంచి సాయంత్రం వరకు రిపోర్టర్లు వివిధ ప్రాంతాల నుంచి సేకరించే వార్తలను డెస్క్ లో కూర్చునే సబ్ ఎడిటర్లు.. తప్పులు దిద్ది.. వాక్యాలను సరిచేసి. . వాటికి అనువైన ఫోటోలను పెట్టి.. కథనాలను, వార్తలను అందిస్తుంటారు. ఇందుకోసం వీరికి యాజమాన్యాలు ముందుగానే తర్ఫీదునిస్తాయి. అంతేకాదు వీరికి శిక్షణానంతరం ఉద్యోగం కల్పించి.. సబ్ ఎడిటర్ / స్టాఫ్ రిపోర్టర్ అనే డెసిగ్నేషన్లను కూడా ఇస్తాయి. వీరు శిక్షణ పొందిన జర్నలిస్టులుగా సమాజానికి ఏ వార్త అందించాలి.. ఏ కథనాన్ని ఇవ్వాలి అనే అవగాహనతో ఉంటారు. అలాంటి డెస్క్ జర్నలిస్టులు ఇవాళ తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. నిత్యం నాయకులు అధికారులు చుట్టే తిరిగే విలేకరుల ఆధిపత్యం ముందు తమకంటూ గుర్తింపు కోసం పోరాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డేస్కు జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఉండేవి కావు. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాడు కెసిఆర్ ప్రభుత్వం కాలానికతీతంగా పనిచేసే డెస్క్ జర్నలిస్టుల కష్టాలు, నష్టాలు తెలుసుకొని.. వారిని కూడా జర్నలిస్టులుగా అధికారికంగా గుర్తించి అక్రిడేషన్లు మంజూరు చేసింది. అంతేకాదు హెల్త్ కార్డులు, బస్సు పాసులు లాంటి వాటికి అర్హులుగా ప్రకటించింది. ఈ చొప్పున చూసుకుంటే ప్రభుత్వం జర్నలిస్టులకు ఇవ్వబోయే ఇళ్ల స్థలాలకు కూడా డెస్క్ జర్నలిస్టులు నూటికి నూరు శాతం అర్హులన్నది ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఖమ్మం లోని స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గం వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.
పలుకుబడి ఉంది కదా అని..
తమ ఆధిపత్యం కొనసాగిస్తూ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటూ అధికారాన్ని చెలాయిస్తూ.. జర్నలిస్టులుగా అక్రిడేషన్లు ఇచ్చి ప్రభుత్వమే గుర్తింపు కల్పించిన డెస్క్ జర్నలిస్టులు (సబ్ ఎడిటర్స్) ను అసలు జర్నలిస్టులే కారని, వారికి యాజమాన్యాలు వేతనాలు ఇస్తాయి.. ఇళ్ల స్థలాలు ఎందుకని వ్యాఖ్యలు చేస్తూ సొసైటీలో సభ్యత్వం ఇవ్వకుండా అవమానాలకు గురి చేస్తున్నారు. అయితే ఖమ్మం జర్నలిస్టుల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో అప్పటి ఖమ్మం ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఎన్ఎస్పి కి చెందిన భూమిని కేటాయించారు. ఆ సమయంలో ఖమ్మంలో పనిచేస్తున్న విలేకరులతో పాటు వివిధ పత్రికల యూనిట్ కార్యాలయాల్లోని డెస్క్ లలో పని చేస్తున్న సబ్ ఎడిటర్ల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే కూడా చేయించారు. గతంలో తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్థలాలు రాలేదని లీగల్ అఫిడవిట్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత నాటి కెసిఆర్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో సభ్యత్వాలు ఇస్తామంటూ నాటి కమిటీ 1,100 రూపాయలు రుసుము కూడా తీసుకుంది. ఈలోపు ఎన్నికలు రావడం ఈ ప్రక్రియ పెండింగ్ పడింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముందుగా ఆ సొసైటీకి పెట్టిన కేసీఆర్ పేరును మార్పించి స్తంభాద్రి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీగా చేశారు. అంతేకాదు గత కార్యవర్గాన్ని కూడా మార్చి కొత్త అధ్యక్ష కార్యదర్శులను, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక కొత్తగా వచ్చిన కార్యవర్గం కూడా గతంలో తీసుకున్న దరఖాస్తులనే కొనసాగిస్తామని, అదే ప్రక్రియ కొనసాగుతుందని, దాని ప్రకారమే అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ ప్రకటించింది. దానికి అనుగుణంగానే ప్రక్రియను వేగవంతం చేసి.. సభ్యత్వాలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో దాదాపు 160 మంది విలేకరులకు సభ్యత్వాలు రసీదులు ఇచ్చారు. ఇక్కడే సొసైటీ కార్యవర్గ అసలు రూపం బయటపడింది. డెస్క్ జర్నలిస్టులకు సభ్యత్వాలు లేవంటూ ప్రచారాన్ని బయటకు పంపింది. అధికారికంగా ఎక్కడ చెప్పకపోయినా లోలోపల మాత్రం తమ పని చేసుకుపోయారు. ఈ పరిణామాలు గమనిస్తూ వచ్చిన డెస్క్ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వకుండా.. వారేదో సబ్ ఎడిటర్లకు సొంత ఆస్తులు రాసిస్తున్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు.
నిరసనగళం వినిపిస్తున్న డెస్క్ జర్నలిస్టులు
ఇక స్తంభాద్రి హౌసింగ్ సొసైటీ పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరుపై ఖమ్మం జిల్లా లోని వివిధ పత్రికల్లో పని చేస్తున్న డెస్క్ జర్నలిస్టులు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇన్ని రోజులు తమను నమ్మించారని, తీరా ప్రక్రియ చివరి దశకు చేరుకున్న తర్వాత కుంటి సాకులు చెబుతూ సభ్యత్వాలు ఇవ్వకుండా తమకు ఇళ్ల స్థలాలను దూరం చేసే కుట్ర చేస్తున్నారని స్తంభాద్రి హౌసింగ్ సొసైటీ కార్యవర్గంపై మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల డెస్క్ జర్నలిస్టుల సమావేశాన్ని నిర్వహించుకొని.. తమ కార్యాచరణ రూపొందించుకున్నారు. స్తంభాద్రి డెస్క్ జర్నలిస్ట్ ఫోరం పేరుతో ఒకతాటి పైకి వచ్చారు. అన్ని అర్హతలు కలిగిన జర్నలిస్టులుగా.. ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా స్తంభాద్రి హౌసింగ్ సొసైటీలో సభ్యత్వాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం స్తంభాద్రి హౌసింగ్ సొసైటీ కార్యవర్గ తీరుతో తాము తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నామని.. శిక్షణ పొందిన జర్నలిస్టులుగా ఏళ్ల తరబడి పని చేస్తున్న తమను గుర్తించకుండా అవమానించడం సమంజసం కాదని, ఈ విషయంపై పునరాలోచించుకోవాలని.. లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
వరంగల్ కొత్త ప్రెస్ క్లబ్ లోనూ..
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అనేది ప్రస్తుతం చాలా పటిష్టమైన వ్యవస్థగా ఉంది. అలాంటి ప్రెస్ క్లబ్లో ప్రస్తుతం ఆధిపత్య పోరు నడుస్తోంది. దాంతో కొందరు వరంగల్ జిల్లాకు చెందిన జర్నలిస్టులు తమకంటూ కొత్త ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం సభ్యత్వాలను తీసుకోవాలని కూడా నిర్ణయించారు. కానీ ఇక్కడ కూడా డెస్క్ జర్నలిస్టులకు అవమానమే ఎదురయింది. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్లో డెస్క్ జర్నలిస్టులకు చాలామందికి సభ్యత్వాలు ఉన్నాయి. కానీ కొత్తగా తాము పెట్టుకోబోతున్న వరంగల్ ప్రెస్ క్లబ్ లో మాత్రం డెస్క్ జర్నలిస్టులకు అవకాశం లేదంటూ తేల్చేశారట. దాంతో గతంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో సభ్యత్వాలు పొందలేకపోయిన వారు ఇందులో సభ్యత్వాలు దక్కుతాయని ఆశించిన వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారట.
ఈసారి అక్రిడేషన్లలోను కోతేనా..?
గత కెసిఆర్ ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులను గుర్తిస్తూ అక్రిడేషన్లను కల్పించిన విషయం తెలిసిందే. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అక్రిడేషన్లలో కోత విధించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మీడియా అకాడమీ కీలకబాద్యల్లో ఉన్న ఓ ముఖ్యుడు, సీనియర్ జర్నలిస్టు కొందరు సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ యాజమాన్యాలు ఇచ్చే అరకురా జీతాలతో జీవితాలను వెల్లదీస్తున్న డెస్క్ జర్నలిస్టులకు ఉన్న ఒక్క గుర్తింపు కూడా తీసేయడం సమంజసం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తమ అస్తిత్వం దెబ్బతినే పరిస్థితి ఉంటుందని.. కానీ ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు తమకు అన్యాయం చేయదని నమ్ముతున్నామని.. ఒకవేళ డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లలో కోత విధించే ఆలోచన ఏమైనా ఉంటే విరమించుకోవాలని కోరుతున్నారు.