కేటీఆర్‌ను ఇరికించబోయి.. రేవంత్‌రెడ్డి ఇరుక్కుపోయారా?
కేటీఆర్ ను ఏసీబీ ఆఫీసులో గంటల తరబడి కుర్చోబెట్టాలని, ఇంటిపై సోదాలు చేసి కుట్రపూరితంగా పేపర్లు పెట్టి తప్పుదారి పట్టించాలని చూశారని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి అంటున్నారు. విచారణ అధికారి బయటకు వచ్చి కేటీఆర్ నుంచి లేఖ తీసుకున్నారని.. పన్నాగం నడవలేదని, ఆ నాటకం రక్తి కట్టకపోవడంతో గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
గ్రీన్ కో కంపెనీ కాంగ్రెస్ బీజేపీతో పాటు ఇతర పార్టీలకు కూడా ఇచ్చిందన్న మాజీమంత్రి జగదీశ్ రెడ్డి.. నష్టం వస్తుందని వెనక్కు పోయిన గ్రీన్ కో మాకు ఎలా బాండ్లు ఇస్తారని ప్రశ్నించారు. మోసపోయిన రైతులు తిరగబడుతుంటే పక్కదారి పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. పనికిమాలిన చెత్త కేసులో ఇప్పుడు ప్రభుత్వం ఇరుక్కొందన్న జగదీశ్ రెడ్డి.. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్ల అంశంపై చర్చ కూడా అవసరం లేదన్నారు.
విచారణలు తోలు బొమ్మలాటలా నడుస్తున్నాయని.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పొద్దు తిరుగుడు పువ్వు అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఏసీబీ హైకోర్టు ముందుంచిన 200 పేజీల రిపోర్ట్ లో గ్రీన్ కో ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించిన జగదీశ్ రెడ్డి.. ఫార్ములా-ఈ రేసు కంటే ముందే గ్రీన్ కో ఎలెక్టోరల్ బాండ్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఫైళ్లు ప్రభుత్వం దగ్గర ఉంటాయి... కేటీఆర్ ఎక్కడి నుంచి తెస్తారని జగదీశ్ రెడ్డి నిలదీశారు.