ఏపీలో పింఛన్లను తగ్గించేలా చంద్రబాబు కొత్త ప్లాన్..! వర్కవుట్ అవుతుందా?
ఏపీలో కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తోంది.ముఖ్యంగా పింఛన్లతో పాటు రేషన్ కార్డుల మంజూరుకు నిర్ణయించింది. అయితే అనర్హులు పెద్ద ఎత్తున పింఛన్లతోపాటు రేషన్ కార్డులు పొందినట్లు గుర్తించింది. వాటిని తొలగించిన తరువాతనే కొత్తవి ఇవ్వాలని చూస్తోంది. ముఖ్యంగా పింఛన్ల ఏరివేత పై దృష్టి పెట్టింది.
వైసీపీ హయాంలో పింఛన్లలో భారీ అవినీతి జరిగిందన్నది కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ తరుణంలో పింఛన్ల లో కొత్త వేసేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. బోగస్ పింఛన్లపై సర్వే ప్రారంభం కానుంది. వీటి విషయంలో ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం సర్వే చేసి అనర్హులను తొలగించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 8,18,900 దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులకు పింఛన్లు అందిస్తున్నారు. అయితే వీరిలో చాలామంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది . అందుకే వారి వైకల్య శాతాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా టీంలను నియమించింది. దీర్ఘకాలిక రోగులకు సంబంధించి వారి ఇంటి వద్ద మెడికల్ టీం తనిఖీలు చేస్తుంది. దివ్యాంగులకు సంబంధించి ఆర్థోపెడిక్ హ్యాండీక్యాప్డ్, దృష్టిలోపం, వినికిడి లోపం, మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యం వంటి వారిని ముందుగా ఇంటివద్ద తనిఖీ చేస్తారు.
అనంతరం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తారు. అది కూడా లబ్ధిదారులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో మాత్రమే వెరిఫికేషన్ చేయనున్నారు. ఈ తనిఖీ బృందంలో ఆర్థోపెడిషియన్, జనరల్ ఫిజీషియన్, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. ఈ కారణంతో పెన్షన్ తీసుకుంటున్నారో.. సంబంధిత వైద్యుల ద్వారా రీ వెరిఫికేషన్ చేయించనున్నారు. వైద్య బృందాలను ఏర్పాటు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం.
తనిఖీల సమయంలో 18 ప్రశ్నలకు పింఛనుదారుడు నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది. రి వెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరైనా ఆరోపణలు ఉన్నట్లుగా బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందుతున్నట్లు గుర్తిస్తే.. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. పూర్తిస్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత అనర్హులు అని తేలితే పింఛన్లు తొలగిస్తారు.