ప్రాజెక్టులు కూడా ప్రైవేటు చేతికి.. బాబు సంచలన ఆలోచన?

పీపీపీ మోడల్.. అంటే పబ్లిక్‌ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌. అన్నీ ప్రభుత్వమే చేయాలనే ఆలోచన నుంచి బయటకు వచ్చాక ఈ మోడల్‌కు ఆదరణ పెరిగింది. దీంతో ప్రభుత్వంపై వ్యయం, భారం తగ్గుతుంది. దీని ప్రకారం.. ప్రైవేటు సంస్థలే నిర్మిస్తాయి.. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వం వాడుకుంటుంది. ప్రస్తుతం జాతీయ రహదారులు ఇలాంటి పద్దతి కిందకే వస్తాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు మరో వినూత్న ఆలోచన చేస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టులను సైతం ఇదే పద్దతిలో నిర్మించే ఆలోచన చేస్తున్నారు. తాజాగా ఆయన  గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై దృష్టి కేంద్రీకరించారు. దీన్ని హైబ్రిడ్ విధానంలో పూర్తిచేసే ఆలోచన ఉందని తెలిపారు. ప్రైవేటు సంస్థలు చేపడితే ప్రభుత్వం చెల్లింపులు చేసే విధానం రాజస్థాన్‌లో చేశారని చంద్రబాబు అంటున్నారు. రోడ్ల మాదిరిగా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ ప్రైవేటు సంస్థలు చేపట్టాలని చంద్రబాబు సూచిస్తున్నారు. దీనికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ వరకు ప్రభుత్వం ఇస్తుందంటున్నారు చంద్రబాబు.

సకాలంలో నీరిస్తేనే చెల్లింపులు చేసే హైబ్రిడ్ విధానంపై యోచిస్తున్నామని.. డీపీఆర్ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామని చంద్రబాబు అంటున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు ప్రయాణిస్తోందంటున్న చంద్రబాబు.. మనమూ ఆ దిశగా ఆలోచనలు చేయాల్సి ఉందన్నారు. యూనిట్ విద్యుత్ ధర రూ.5.18 నుంచి రూ.4.80కి తగ్గించడం లక్ష్యమన్న చంద్రబాబు యూనిట్‌ విద్యుత్ ధర తగ్గించేందుకు వినూత్న యోచనలు చేస్తున్నామన్నారు.

డబ్బుంటే 3ఏళ్లలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయొచ్చంటున్న సీఎం చంద్రబాబు...ఇది దేశంలోనే అతి పెద్ద సాగునీటి మౌలిక వసతి అవుతుందన్నారు. ప్రధాని మోదీకి ఈ ప్రాజెక్టు నివేదిక పంపిస్తున్నామని.. ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రితో మాట్లాడామని.. కేంద్రమే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించలేదు కాబట్టి హైబ్రిడ్ మోడల్‌లో నిధుల సమీకరణకు ఆలోచిస్తున్నామని చంద్రబాబు వివరించారు. గోదావరి-బనకచర్లతో 80 లక్షల మందికి తాగునీరు,  7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందని చంద్రబాబు తెలిపారు. గోదావరి-బనకచర్లకు 48వేల ఎకరాల భూసేకరణ, 17వేల ఎకరాల అటవీ భూమి అవసరమన్నారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: