ఉత్తరాంధ్రలో క్యాడర్ ని పట్టించుకోని వైసీపీ లీడర్లు..! అందరూ రాజకీయ సన్యాసం తీసుకున్నారా?
వైసీపీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ ఎన్నికల్లో దారుణ పరాజయంతో హై కమాండ్ నిస్సత్తువగా మారిపోయింది. ఉత్తరాంధ్రలో పరిస్థితి తీసుకట్టుగా మారింది. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్ర నేతలకు జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ కష్ట కాలంలో ఉంటే వారంతా ముఖం చాటేస్తున్నారు. కనీసం పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అయితే కనీసం ఖాతా తెరవలేదు. 2019 ఎన్నికల ఓటమితో టీడీపీ సీనియర్లు సమన్వయంతో పనిచేసి అధికారంలోకి రాగలిగారు. కానీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రక్షాళనకు దిగారు జగన్. ఈ క్రమంలోనే ధర్మాన ప్రసాదరావును ఆశ్రయించారు. పార్టీ ఇన్చార్జ్ పదవి తీసుకుని యాక్టివ్ కావాలని కోరారు. దానికి ధర్మాన ప్రసాదరావు నుంచి ఇంతవరకు స్పందన రాలేదని తెలుస్తోంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహించిన ఆమదాలవలసలో చింతాడ రవికుమార్ అనే యువకుడికి వైసీపీ బాధ్యతలు అప్పగించింది. దీంతో తమ్మినేని పార్టీలో ఉంటారా?ఉండరా? అన్నది తెలియాల్సి ఉంది.
పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి మాజీమంత్రి పీడిక రాజన్న దొర సైతం రాజకీయాలపై నిరాసక్తత వ్యక్తపరుస్తున్నారు. వరుసగా నాలుగు సార్లు సాలూరు ఎమ్మెల్యేగా గెలిచారు రాజన్న దొర. కానీ ఈసారి దారుణ పరాజయం ఎదురైంది. దీంతో ఇక రాజకీయాలకు స్వస్తి పలకడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు రాజన్న దొర సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరాయ కళావతి రాజకీయాల పట్ల విముఖంగా ఉన్నారు. ఇప్పటికే తన అభిప్రాయాన్ని అధినేతకు వివరించారు.
విశాఖ జిల్లాలోను ఇదే పరిస్థితి. మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, పసుపులేటి బాలరాజు, అవంతి శ్రీనివాసరావు లాంటి నేతలు రాజకీయంగా కొనసాగడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు సైతం పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. రాజకీయాలు ఇక చాలు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే నాయకులు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు.. పార్టీ ఫైనల్. అందుకే వారు తమ వారసులను తెరపైకి తెస్తారా? లేకుంటే పార్టీ ప్రత్యామ్నాయ నేతలను ఎంచుకుంటుందా?అన్నది కాలమే నిర్ణయిస్తుంది.