రేవంత్ సర్కార్ మందు చూపు? అసలు కొరత రావొద్దు అంట?
మద్యం ప్రియులకు ఎగిరి గంతేసే వార్త చెప్పింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతారని పెద్ద ఎత్తున వార్తలు వెల్లువగా మారిన వేళ తెలంగాణ ఎక్సైజ్ శాఖ తాజాగా ధరల విషయంలోనూ, వచ్చే సీజన్ కు లిక్కర్ ప్రొడక్షన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.
రానున్నది వేసవికాలం. ఇక వేసవికాలంలో మందుబాబులు చల్ల చల్లని బీర్లు కోసం మద్యం దుకాణాల వెంట పరుగులు పెడతారు. ప్రతి సమ్మర్ సీజన్లోనూ సరిపడా బీర్లు లేక, బీర్ల కొరత ఏర్పడుతుంది. అయితే ఈసారి అలా బీర్ల కొరత లేకుండా చూడడం కోసం ఇప్పటినుంచే ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయింది. రాబోయే వేసవి కోసం బీర్ల కొరత లేకుండా చూడాలని బేవరేజెస్ కంపెనీలకు సూచించింది.
దీంతో కంపెనీలు నెల రోజులుగా బీర్ల ఉత్పత్తిని పెంచాయి. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ కంపెనీలో సాధారణంగా నెలకు మూడు నుండి నాలుగు లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి అవుతుండగా, ప్రస్తుతం దానిని ఐదు లక్షలకు పెంచింది. ఒక్క ఈ కంపెనీ మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు, బీర్ల ఉత్పత్తిని పెంచుతూ పోతున్నాయి.
దీంతో వచ్చే వేసవికి సరిపడా స్టాక్ ఉంటుందని, మందుబాబులకు స్టాక్ లేక ఇబ్బంది ఉండబోదని బెవరేజెస్ కంపెనీలు భావిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు ఉత్పత్తిని పెంచిన బేవరేజెస్ వచ్చే సమ్మర్ సీజన్ కు మందుబాబులకు మత్తెక్కించడానికి ఇప్పటి నుండే రెడీ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం రేట్లు పెంచుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో మద్యం అమ్మకాల పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి పడుతున్న వేళ లిక్కర్ సేల్స్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కడా అధిక ధరలకు లిక్కర్ విక్రయించకుండా రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మద్యం అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి.