ఈ సారి పిట్ట కథతో మీడియా ముందుకు వచ్చిన జగన్? కథ మామూలుగా లేదుగా?
సహజంగా మన దేశంలో అధికారంలో ఉన్న వాళ్లకు అభివృద్ధి చేయాలి అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న వారికి ప్రజల బాధ కళ్ళకు కనిపిస్తుంది. ఇక్కడ ఎవరి బాధ వాళ్ళది.. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసిపి దారుణంగా ఓడిపోయింది. దీంతో ఒక్క సారిగా ఆ పార్టీకి ప్రజల సమస్యలు గుర్తుకు వస్తున్నాయి.
కూటమినేతలు చేస్తున్న పనుల వల్ల “ప్రజా కంటకం” అనే మాట వారి గొంతు నుంచి ధ్వనిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. కూటమినేతలు చేస్తున్న తప్పులను ఎండగడుతున్నారు. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేందుకు.. వారు అర్థం చేసుకునేందుకు చిన్నచిన్న కథలను చెబుతున్నారు. అలా జగన్మోహన్ రెడ్డి ఒక కథను చెప్పారు. దీనిని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నాయి. ఇందులో బీజేపీ నాయకులకు పాత్ర ఇవ్వడం.. మీడియా సంస్థలను ఇన్వాల్వ్ చేయడం ఆకట్టుకుందని వైసీపీ నేతలు అంటున్నారు.
“ఓ అమాయకుడు తన కుక్కపిల్లను తీసుకొని బయటికి వెళ్తాడు. దానిని భుజాన వేసుకొని అతడు ప్రయాణం సాగిస్తాడు. మొదట్లో ఒక వ్యక్తిని దానిని మేక అంటాడు. నేను ఒక పిల్లను మెడలో వేసుకుంటే మేక అంటున్నాడు ఏంటని ఆ వ్యక్తికి అనుమానం వస్తుంది. ఆ తర్వాత రెండవ వ్యక్తి కూడా అలానే మేక పిల్ల అంటాడు. మూడో వ్యక్తి కూడా ఇలానే అంటాడు. నాలుగో వ్యక్తి కూడా మేక పిల్లను ఎత్తుకొని పోతున్నావేంటి అని అంటాడు. దీంతో ఆ కుక్కను మోసుకుపోతున్న వ్యక్తికి అనుమానం వస్తుంది. దీంతో ఆ కుక్కను కింద పడేస్తాడు. ఈ కుక్క వద్దు, ఆ మేక వద్దు అని అతని వెళ్ళిపోతాడు. ఇందులో మేక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మోసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. అలా నాలుగు సార్లు అతనికి తప్పుడు సమాచారం ఇచ్చిన వారిలో మొదటి వ్యక్తి చంద్రబాబు, రెండో వ్యక్తి దత్తపుత్రుడు, మూడో వ్యక్తి పురందరేశ్వరి, నాలుగో వ్యక్తి ఎల్లో మీడియా.. ఇలా వ్యవహారిక నేరాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని” జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ తరహాలో ఎన్నడూ మాట్లాడలేదు. అంతటి ఎన్నికల్లోనూ ఇలాంటి కథలను చెప్పలేదు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయారు కాబట్టి… కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై ఉన్న కేసులను తిరగతోడుతోంది కాబట్టి.. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేరువ కావాలని భావించారని.. అందువల్లే ఈ పంథాను అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.