చంద్రబాబు లో నాటి సీఎం కనిపించడం లేదా..?
మళ్లీ ఆనాటి వైఖరి ఆ కాలం తీరు ఎలా వస్తాయి. ఎవరికైనా ఇది సాధ్యం కాదేమో. చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన 1995 నాటికి 45 ఏళ్ల వయసున్న వారు, ఫుల్ జోష్ లో ఉండేవారు, ఆ హుషారు ఆ జోరు వేరే లెవెల్ అని కూడా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆనాడు ఆయన పాలనలో సంస్కరణలు తెచ్చారు.ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా ఉద్యోగుల అలసత్వానికి బ్రేకులు వేశారు. ఎక్కడా కూడా ఎవరూ ఏ తప్పూ చేయకుండా కఠినంగా చూసారు. ఫలితంగా ఆయనకు 1999 లో తక్కువ సీట్లు వచ్చాయి. అయినా అధికారం దక్కింది. 2004లో పూర్తిగా అధికారం పోయింది. దాంతో ఉద్యోగులతో పెట్టుకోవడం వల్లనే అని గ్రహించి బాగా తగ్గిపోయారు.
ఇక 1995లో చూస్తే బాబు ఏ విషయం మీద అయినా పూర్తి ఫోకస్ పెట్టారూ అంటే అది మొత్తం అంతు చూడాల్సిందే అన్నట్లుగా ఉండేవారు. విభజన ఏపీలో 2014లో సీఎం అయిన చంద్రబాబు తీరు కూడా మారింది. ఆ అయిదేళ్ళ పాలనలో ఆశ్రిత పక్షపాత్రం అవినీతి వంటి వాటి మీద విమర్శలు వచ్చాయి. చివరికి ప్రభుత్వం 2019లో ఓటమి పాలు అయింది.
2024లో చంద్రబాబు సీఎం అయినా ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఉన్నారు. చంద్రబాబు ఒక్కరే స్టీరింగ్ తిప్పటం లేదు అన్నది కూడా ఒక చర్చగా అయితే జనాల్లో ఉంది అని అంటున్నారు. గతానికి ఇప్పటికె మరో తేడా ఏంటి అంటే అప్పట్లో చాలా దూకుడుగా ఉండేవారని అంటారు. ఇపుడు తగ్గింది అన్నది కూడా ఉంది. ఇక చంద్రబాబుతో నాడు కాంగ్రెస్ వైఎస్సార్ ఇతర కాంగ్రెస్ నేతలు ప్రత్యర్ధులుగా రాజకీయ పోరాటం చేసినా హద్దులు ఎవరూ దాటేవారు కాదు, ఇపుడు మాత్రం అటూ ఇటూ కూడా దూకుడే కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే 1995 నాటి బాబుని అని ఆయన ఎంత చెప్పినా ఆనాటి డైనమిక్ నేచర్ ని చూసిన వారు మాత్రం మళ్ళీ ఆ రోజులు వస్తాయా అని చర్చించుకుంటున్నారు.