బాబు గ్రేట్.. ఈ విషయంలో చంద్రబాబు నీ ప్రతి ఒక్కరూ మెచ్చుకోవల్సిందే !
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ లపై నిత్యం పోస్టులు పెట్టేవారు ఉన్నారు. ముఖ్యంగా వైసిపి అనుకూల సోషల్ మీడియా ప్రతినిధులు తెగ రెచ్చిపోయేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వారిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇటీవల స్పందించారు. అటువంటి వారి విషయంలో పోలీస్ శాఖ ఉదాసీనంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ సమావేశంలో సైతం తన బాధను వ్యక్తపరిచారు. తనతో పాటు చంద్రబాబు కుటుంబం సైతం బాధితులుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సైతం తానూ బాధితురాలిననని గుర్తు చేశారు. ఈ తరుణంలో పోలీస్ శాఖ పై విమర్శలు రావడంతో పెద్ద దుమారం నడిచింది. కడప జిల్లాకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. జగన్ కుటుంబానికి సహాయకుడిగా పని చేసేవారు. సోషల్ మీడియాలో ఆయన పోస్టులు సైతం జుగుప్సాకరంగా ఉండేది.
ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే ఆయన అరెస్టు విషయంలో కడప పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కడప జిల్లా పై బదిలీ వేటు పడింది. ఈ పరిణామ క్రమంలో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అనుకూల సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టు పర్వం ప్రారంభం అయ్యింది.
అయితే హైకోర్టులో ఈ సోషల్ మీడియా ప్రతినిధుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు కొనసాగాయని.. విచారణలో ఆహారం సైతం అందించడం లేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు సంబంధించి సి సి ఫుటేజీలను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఇదొక సంచలనం గా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఉక్కు పాదంతో అణచివేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నేతల కుటుంబాలపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడబిడ్డల జోలికి వెళ్లి ఏ ఒక్కరిని వదలమని హెచ్చరించారు. అక్కడ పార్టీలతో సంబంధం లేదని.. సోషల్ మీడియా బాధితులు లేకుండా చూడడమే లక్ష్యమని తేల్చి చెప్పారు చంద్రబాబు. మొత్తానికైతే చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.