చంద్రబాబు హెచ్చరికల్ని మంత్రులు లైట్ తీసుకుంటున్నారా?

మనిషన్నాక ఒకసారి వినాలి.. ఆచరించాలి. మంత్రన్నాక కూడా అదే ఫార్ములా!! కానీ, ఏపీ మంత్రుల విషయంలో అదేంటో చిత్రంగా చంద్రబాబు పదే పదే చెబుతూనే ఉన్నారు.


మంత్రులు వింటూనే ఉన్నారు. ఎప్పుడు కేబినెట్ సమావేశం జరిగినా ..చివరిలో ''మంత్రులకు చంద్రబాబు క్లాస్ ఇచ్చారు!'' అంటూ పెద్ద టైటిల్‌తో వార్తల పరంపర ప్రారంభమవుతుంది. మరి ఇది ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఇప్పటికి తొమ్మిది సార్లు మంత్రి వర్గ భేటీలు నిర్వహించారు. నాలుగు మాసాల్లో తొమ్మిది సార్లు కేబినెట్ భేటీ జరిగినా.. ప్రతిసారీ ఇదే తరహా 'క్లాస్‌'.. వార్తలు వస్తున్నాయి.


ఇప్పుడు కూడా.. చంద్రబాబు పాత తరహాలోనే మంత్రులకు క్లాస్ ఇచ్చారు. ''ఎన్ని సార్లు చెప్పాలి. మీరు మారరా?'' అని వారిని ప్రశ్నించారు. అంతేకాదు.. ఇకపై చెప్పడాలు ఉండవని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఇదంతా కూడా సుతి మెత్తగానే సాగిపోయినట్టు సమాచారం. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరేసి మంత్రులతో చంద్రబాబు చర్చించారు. వారి పనితీరు బాగోలేదని చెప్పుకొచ్చారు. సీరియస్ నెస్ కనిపించడం లేదన్నది చంద్రబాబు ప్రధానంగా చేసిన ఆరోపణ. ఈ నేపథ్యంలో పనితీరును మెరుగు పరుచుకుని సీరియస్‌గా పనిచేయాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు.


ఇక, అధికారుల విషయంలోనూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయా శాఖలకు మంత్రుల తర్వాత.. బలమైన అధికారం ఉన్న కార్యదర్శులుగా ఉన్న కొందరు అధికారులు వైసీపీ మూలాలను మరిచిపోలేకపోతున్నారని చంద్రబాబు చెప్పారు. దీంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయన్నారు. ఇసుక, మద్యం విషయాలను పక్కన పెడితే.. శాంతి భద్రతలు, సోషల్ మీడియా సహా అనేక అంశాలపై వారి పనితీరును ప్రశ్నించారు. ఇక, ముందు కూడా.. ఇలానే చేస్తే.. సహించేది లేదన్నారు. అయితే.. చంద్రబాబు ఇంత చెప్పిన తర్వాతైనా వారు మారతారో.. లేకపోతే.. ఆయన చెప్పారు. వీరు విన్నారు.. అనే తరహాలోనే లైట్ తీసుకుంటారా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: