ఆ విషయంలో వైసీపీ నీ దెబ్బ తీస్తున్న పవన్? జగన్ కి అర్థం అవుతుందా?
11 మంది ఎమ్మెల్యేలతో విపక్ష హోదా కావాలని పట్టుబట్టి పంతానికి పోయి వైసీపీ అసెంబ్లీనే కాదనుకుంది. దాని వల్ల అక్కడ ఆ పార్టీ మిస్ అయినట్లు అయింది. ఇక జనంలో అయితే జగన్ అపుడపుడు వచ్చినా పార్టీ మొత్తం అయితే నిస్తేజం అయింది.
జగన్ ని వివాదాలు చుట్టుముట్టడంతో ఇబ్బందిని పడుతున్నారు. దాంతో ఏపీలో విపక్షం అన్నది లేదన్న భావన అయితే జనంలో ఏర్పడింది. సరిగ్గా టైం చూసి ఈ స్లాట్ లోకి జనసేన దూరేసిందా అన్నది పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన పిఠాపురం పర్యటనలో చర్చగా వస్తోంది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో మాట్లాడింది జనం వైపు నుంచి. వారి గొంతుకగా మారి ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ప్రభుత్వంలో ఉంటూ ప్రశ్నించకూడదు అని అంటారు. కానీ అది రాజకీయం స్ట్రాటజీ అవుతుంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం లో ఉంటూ కూడా తప్పులు ఉంటే ప్రశ్నిస్తే అది నిజాయతీ అవుతుంది, నిబద్ధత కూడా అవుతుంది. పవన్ ఇపుడు అదే చేశారు అని అంటున్నారు.
తాము అధికారంలో ఉన్నా కూడా ప్రజా రక్షణ విషయంలో ప్రజా సమస్యల విషయంలో తగ్గేది లేదు అన్న సందేశం ఆయన పంపించడం ద్వారా ప్రభుత్వంలో ఏమైనా లోటు పాట్లు ఉంటే వాటిని సరిచేసే యత్నం చేస్తున్నారు. అధికారంలో తాము ఉన్నా నిర్మాణాత్మకమైన విపక్షంగా వ్యవహరిస్తామని పవన్ చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇది ఒక విధంగా వైసీపీకి మింగుడు పడనిదే. పవన్ చేసిన కామెంట్స్ జనంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. ఆయన జనం నాడిని పట్టుకుని దానిని తగినట్లుగా ఇచ్చిన స్టేట్మెంట్స్ బాధిత సెక్షన్లలోకి బలంగా వెళ్ళాయి. తద్వారా జనసేన అక్కడ పొలిటికల్ గా మైలేజ్ ని సాధించింది.
అదే సమయంలో ప్రతిపక్షంలో ఉండాల్సిన వైసీపీ తన పాత్రను మిస్ చేసుకుంటోంది అన్న భావన అయితే కనిపిస్తోంది. విపక్ష స్థానం మెల్లగా జనసేన తీసుకుంటోంది అన్నది వైసీపీకి అర్ధం అయింది అని అంటున్నారు.