అమెరికాలో తొలి ఓటు పడేది అక్కడే? వారు ఎన్నుకున్న వారే అధ్యక్షులవుతారు?
నార్త్ కరోలినా, ఆస్టిన్, టెక్సాస్, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ వంటి రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినాల్లో తాజాగా కమలా హ్యారిస్ ర్యాలీలను హోరెత్తించారు. అమెరికా కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి దాటిన అయిదు నిమిషాలకే ఓ కుగ్రామంలో తొలి ఓటు పడబోతోంది. ఓటర్లు బ్యాలెట్ పేపర్లపై సంతకం చేయడంతో ఈ ప్రక్రియ ఆరంభమౌతుంది. లెక్కింపు కూడా అప్పటికప్పుడే పూర్తవుతుంది. అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితం అదే అవుతుంది. 2020 నాటి ఎన్నికల్లో ఇక్కడి ఓట్లన్నీ గంపగుత్తగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కే పోల్ అయ్యాయి. తొలి ఫలితం ఆయనకు అనుకూలంగా వెలువడింది.
దీనితో ఆయన బోణీ కొట్టినట్టయింది అప్పట్లో. అక్కడ మెజారిటీ సాధించగలిగితే తాము అధికారంలోకి వస్తామనే నమ్మకం అభ్యర్థుల్లో బలంగా నాటుకుపోయింది. ఆ కుగ్రామం పేరు.. డిక్స్‌విల్లే నాచ్. న్యూ హ్యాంప్‌షైర్ స్టేట్‌లో అమెరికా-కెనడా సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది. పర్యాటకులు ఎక్కువగా వచ్చిపోతుంటారిక్కడికి. 1960 నాటి అధ్యక్ష ఎన్నికల నుంచీ ఇక్కడ తొలి ఓటు వేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా తొలి ఓటు పడేది అక్కడే కావడం వల్ల ఫస్ట్ ఇన్ ద నేషన్ అనే ట్యాగ్‌లైన్ ఉంటుందీ గ్రామానికి. దీన్ని గ్రామం అని కూడా అనలేం. మొత్తం 12 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు. వారిలో ఆరుమందికి ఓటు హక్కు ఉంది. ఈ మినీ టౌన్‌షిప్‌నకు ఆనుకునే ఉండే మరో టౌన్ మిల్స్‌ఫీల్డ్‌లో కూడా అదే సమయంలో పోలింగ్ మొలవుతుంది. ఈ రెండు ప్రాంతాలను కలిపి మొత్తం 49 ఓట్లు పోల్ కావాల్సి ఉంది. ఇందులో తొలుత డిక్స్‌విల్లే నాచ్‌లో అయిదు ఓట్లు పడ్డాయి. 2016 ఎన్నికల్లో మిల్స్‌ఫీల్డ్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు మెజారిటీ ఓట్లు పోల్ అయ్యాయి. ఆయనకు 16 ఓట్లు పడ్డాయి.