రాహుల్, సోనియాను ఇబ్బంది పెడుతున్న రేవంత్ ?

సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్ఠానానికి చిక్కు ముడులు తీసుకువస్తున్నారు. హస్తం పార్టీ జాతీయ రాజకీయాలకు పూర్తి భిన్నంగా తెలంగాణలో పాలిటిక్స్ చోటు చేసుకోవడమే ఇందుకు కారణం. దీంతో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనివల్ల జాతీయ నాయకత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి.


ఇదే అదునుగా సీఎం రేవంత్ రెడ్డి పై గుర్రుగా ఉన్న సీనియర్లు అధిష్ఠానానికి నేరుగా కలిసి ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులు, ఇతర విషయాలపై కాంగ్రెస్ అధిష్ఠానం కొట్లాడుతోంది. కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో సీఎం రేవంత్ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వరుస పెట్టి చేర్చుకుంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజీనామా చేసి చేర్చుకోవాలనే నిబంధన ఉంది. కానీ దానికి విరుద్ధంగా ఫిరాయింపులు చోటు చేసుకోవడంతో వీటిని ఎలా తిప్పి కొట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో అధిష్ఠానం ఉంది.


ఇదే సమయంలో బుల్డోజర్ రాజకీయాలపై ఆ పార్టీ అగ్రనేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలు పదే పదే మాట్లాడుతున్నారు. ఇక హైదరాబాద్ లో హైడ్రా పేరుతో బుల్డోజర్లను, ప్రొక్లెయిన్లను పంపి అక్రమ నిర్మాణాలను కూలగొట్టే పనిలో ఉన్నారు. అయితే ఇవి పేద, మధ్య తరగతి నివాసాల మీదకి కూడా వెళ్లడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ హైడ్రా ని వాడుతున్నారు అని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.


ఇక కాంగ్రెస్ కు వరసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.  పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం.. పీఏసీ ఛైర్మన్ పదవి వ్యవహారం రాష్ట్రంలో అగ్గి రాజేసింది. ఇందులో ఏ పార్టీకి మైలేజ్ వచ్చిన విషయం పక్కన పెడితే.. మొత్తానికి హాట్ ఆఫ్ ద టాపిక్ గా మాత్రం రేవంత్ నిర్ణయాలు ఉంటున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు. మరి సీఎం వీటిని ఎలా అధిగమిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: