జగన్‌ బలగం: జగన్‌ సర్కారులో ఈ శ్రీలక్ష్మి వెరీవెరీ స్పెషల్‌?

సీఎంగా జగన్‌ ప్రభుత్వంలో ఎందరో ఐఏఎస్‌లు పని చేశారు. కానీ.. అందరిలోనూ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి వెరీ వెరీ స్పెషల్‌ అని చెప్పాలి. ఎందుకంటే.. ఆమె వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాలో పని చేశారు. 1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి  ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గనుల కేటాయింపులో ఆమె కొందరికి ఆయాచిత లబ్ధి కలిగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలతోనే  అరెస్టయిన ఆమె రిమాండ్ రూపంలో కొద్దిరోజులు జైలు జీవితం కూడా గడిపారు.

ఆ కేసులు నిరూపణ కాకపోవడంతో బయటకు వచ్చిన ఆమెను రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేటాయించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నన్నాళ్లూ తెలంగాణలోనే పని చేసిన శ్రీలక్ష్మి.. జగన్‌ సీఎం కాగానే ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపించారు. వైఎస్‌ కుటుంబంతో ఆమెకు ఉన్న అనుబంధమే ఇందుకు కారణం. శ్రీలక్ష్మి ఏపీకి వచ్చేందుకు జగన్‌ సర్కారు కూడా సహకరించింది. అలా ఐఏఎస్‌ శ్రీలక్ష్మి తెలంగాణ నుంచి జగన్ సర్కారులోకి వచ్చేశారు.

తెలంగాణ నుంచి ఏరి కోరి ఏపీకి వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి.. తనదైన శైలిలో జగన్‌ సర్కారులో పరిపాలనపై ముద్ర వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించిన మున్సిపల్ పరిపాలన శాఖలో సమర్థవంతమైన పనితీరును ప్రదర్శించారు. మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆ శాఖలో శ్రీలక్ష్మి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారనే చెప్పాలి.

జగన్‌ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన కొన్ని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను విజయవంతం చేయడంలో శ్రీలక్ష్మీ కీలక పాత్ర పోషించారు. ప్రత్యేకించి జగనన్న కాలనీల నిర్మాణం వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్‌ శ్రీలక్ష్మి అనే చెబుతారు. ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావట్లేదంటూ ఫిర్యాదులు వచ్చినప్పుడు శ్రీలక్ష్మి స్వయంగా కొన్ని మున్సిపాలిటీల్లో తనిఖీలు చేశారు.  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నిర్మాణ, ప్రారంభోత్సవ కార్యక్రమాలను శభాష్‌ అనిపించే రీతిలో శ్రీలక్ష్మీ విజయవంతం చేశారు. 18.81 ఎకరాల స్వరాజ్‌ మైదాన్‌లో 400 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దిన స్మృతివనం.. అందులోని సౌకర్యాలు అన్నీ  శ్రీలక్ష్మీ ఆలోచనలకు అద్దంపట్టాయి. శభాష్‌ అనిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: