వైఎస్‌ జగన్‌.. తండ్రిని మించిన తనయుడవుతారా?

వైఎస్‌ జగన్‌.. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ వారసుడు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ అప్పట్లోనే కడప ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే తండ్రి పదవి ఉన్నంత కాలం జగన్‌ రాజకీయంగా అంత యాక్టివ్‌గా లేరు. ఏదో తన వ్యాపారాలు తాను చూసుకునేవారు.. వైఎస్‌ హఠాన్మరణం తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. తండ్రి మరణం తర్వాత ఏకంగా సీఎం అవ్వాలని అప్పట్లో జగన్‌  ఎమ్మెల్యేల సంతకాలు సేకరించారన్న వాదనలు ఉన్నాయి.

తండ్రి హఠాన్మరణం తర్వాతే వైఎస్‌ జగన్‌ రాజకీయ జీవితం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇవ్వకపోవడం ద్వారా మొదలైన తిరుగుబాటు జగన్‌ను సిసలైనా రాజకీయ నాయకుడిగా రాటు తేల్చింది. దేశంలో అత్యంత శక్తివంతురాలైన నేతగా ఉన్న సోనియాగాంధీతోనే ఢీకొట్టేందుకు కూడా వెనుకాడని వైఎస్‌ జగన్ ధైర్యం అప్పట్లో చాలామంది చేత అది దుస్సాహసం అనిపించేలా చేసింది.

కానీ జగన్ మాత్రం.. తాను నమ్మిందే చేశాడు. ఎక్కడా ఎవరికీ తలవంచలేదు. అందుకు ఫలితంగానే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆస్తులు పోగేసుకున్నాడని జగన్‌పై ఎన్నో కేసులు పెట్టారు. అరెస్టు చేశారు. పదహారు నెలలపాటు చంచల్‌గూడ జైలులో ఉంచారు. తాను జైలులో ఉన్నా పార్టీని బతికించుకున్నాడు. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం అందుకోలేకపోయాడు.

ఆ తర్వాత ఐదేళ్ల పాటు విపక్షంలో ఉన్నాడు జగన్. చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుని మంత్రి పదవులు ఇచ్చి మరీ పార్టీని బలహీన పరిచినా.. ధైర్యంగానే ఎదుర్కొన్నాడు. జనంలో ఉంటూ.. జనం సమస్యలు వింటూ.. ప్రజానేతగా గుర్తింపు పొందాడు. 2019లో అధికారం చేపట్టిన జగన్‌.. తండ్రి వైఎస్‌ఆర్‌ను గుర్తు తెచ్చేలా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన సాగించాడు. విపక్షాలు బటన్‌ నొక్కుడు సీఎం అని వెక్కిరించినా.. ఆ బటన్‌ నొక్కడం ద్వారానే ప్రజా సంక్షేమం జరిగిందని.. అదే తనను గెలిపిస్తుందన్న దీమాతో ఉన్నాడు. ఇప్పటికే ఐదేళ్లు సీఎంగా చేయడం ద్వారా వైఎస్‌ను సమం చేసిన జగన్‌.. మళ్లీ గెలిచి.. తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటారా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: