పవన్: ఆ తప్పు రిపీట్‌ చేస్తే.. ఫలితాలు దారుణమే?

పవన్ కల్యాణ్ పార్ట్ టైం పొలిటిషీయన్ అనే విమర్శను మూట కట్టుకున్నారు. సీరియస్ గా రాజకీయాలు చేయలేదని ఎక్కువ మంది విమర్శిస్తుంటారు. అందుకే జనసేనకు సరైన విజయం దక్కలేదని విశ్లేషిస్తుంటారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించిందని చెబుతుంటారు. ఆ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది.

మొత్తం 8 స్థానాల్లో జనసేన పోటీ చేయగా.. ఆయన రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేశారు. కానీ ఆ ఎనిమిది చోట్ల డిపాజిట్లు సైతం జనసేన దక్కించుకోలేకపోయింది. ఎన్నికల క్యాంపెయిన్ లో వ్యూహాలు లేక దెబ్బతిన్నారని ఏపీలో మాత్రం ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు  ఎంపీ సీట్లు దక్కాయి. జనసేనాని పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. ఈ 23 స్థానాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఆ 21 అసెంబ్లీ స్థానాల్లో రెండు సార్లు పర్యటించి.. రోజంతా రోడ్ షోలు చేసి, బహిరంగ సభలు నిర్వహిస్తే ఆ పార్టీ తరఫు గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. కానీ గత అనుభవాల దృష్ట్యా పవన్ ఆ పని చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సొంత పార్టీ అభ్యర్థులతో పాటు కూటమి నేతలు గెలిచే ఛాన్స్ ఉంటుంది.

ఇప్పుడు అన్నింటింకి మించి పవన్ తనకు తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు ఎన్నికలను చూశారు. పార్టీకి సరైన విజయం ఇప్పటి వరకు దక్కలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే జనసేనకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యలాంటివే. ఈ ఎన్నికల్లో సరైన విజయం దక్కకుంటే మాత్రం జనసైనికుల్లో అభద్రతా భావం నెలకొనే పరిస్థితి ఉంటుంది. మరోవైపు భాగస్వామ్య పార్టీలు సైతం పక్కన పెట్టే ప్రమాదం లేకపోలేదు.  అందుకే పవన్ ఈ ఎన్నికల్లో కష్టపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అందుకు పవన్ సిద్ధంగా ఉన్నారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: