సిద్ధం ప్రభంజనం.. అంతా నిజమేనా?

సిద్ధం సభలకు భారీగా జనాలు వస్తున్నారని వైసీపీ చెప్పుకొస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సిద్ధం సభలు జరిగాయి. లక్షలాది మంది వచ్చారని ఆయా విజువల్స్ ద్వారా మనకి అర్థం అవుతుంది. అయితే ఇదంతా గ్రాఫిక్ మాయాజాలం అని అటు ఎల్లో మీడియా.. ఇటు టీడీపీ ప్రజలను తప్పుదోప పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. వేల మంది సామర్థ్యం కలిగిన ప్రాంగణాల్లో లక్షలాది మంది ఎలా పడతారు అని ప్రశ్నిస్తున్నాయి.

అధికార దుర్వినియోగంతో జనాలను సమీకరిస్తే తప్పకుండా వస్తారని.. అందులో విశేషం ఏంటని తమ అక్కసును బయట పెడుతున్నాయి. నిన్నటి మేదరమెట్ల సభకు ఆరు జిల్లాల నుంచి 3500 బస్సులను తరలించినట్లు తెలుస్తోంది. వాలంటీర్లు,  గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ఇలా యంత్రాగాన్ని అంతా మోహరించి జనాలను తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి జనసమీకరణ చేసినట్లు తెలుస్తోంది అని ఎల్లో మీడియా రాసుకొచ్చింది.

దీంతో పాటు సిద్ధం ఆఖరి సభలో వాలంటీర్లను కూడా ఉపయోగించుకున్నట్లు తెలిసింది. వారి సేవలను దుర్వినియోగ పరిచింది. చాలా చోట్ల వాలంటీర్లు వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు రావాలని ఇంటికి రూ.500 ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు నిలిపి వేస్తారనే భయంతోనే వీరంతా వచ్చినట్లు రాసుకొచ్చింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలను వాలంటీర్లు, దగ్గర నుంచి సభకు తరలించడం అన్ని జిల్లాల్లో కనిపించింది.

అయితే వీటితో పాటు కొత్త రాగాన్ని అందుకుంది. జనాలు రావడం చూసి తట్టుకోలేక.. ఇదంతా గ్రాఫిక్ మాయాజాలంగా ఎల్లో మీడియా అభివర్ణిస్తుంది.  సభా ప్రాంగంణంలో పూర్తిగా గ్రీన్ మ్యాట్లు పరిచారని.. దీంతో పాటు ఇతర మీడియాకు అనుమతి ఇవ్వలేదని లైవ్ స్ట్రీమింగ్ లో ఈ విషయాలు బయట పడ్డాయని ఆరోపిస్తోంది. వీఎఫ్ ఎక్స్ ఉపయోగించి గ్రీన్ మ్యాట్లలో జనాలను పెట్టారని వింత ప్రచారం చేస్తోంది. అటు ప్రత్యక్ష ప్రసారం కూడా 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అయిందని చెబుతున్నాయి. ఏది ఏమైనా సిద్ధం సభలు మాత్రం వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిందనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: