పాపం రఘురామ.. వెన్నుపోటు ఫిక్స్‌?

రఘురామ కృష్ణం రాజు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇన్నాళ్లూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన టీడీపీ, జనసేన కూటమికి దగ్గరయ్యారు.  నర్సాపురం లోక్ సభ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని ఆయనే ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు కూటమిలోకి అనూహ్యంగా బీజేపీ రావడంతో సమీకరణాలు మారిపోయాయి.  కూటమి తరఫున ఆయనకు టికెట్ కేటాయించే అవకాశాలు లేనట్లు కనిపిస్తోంది.

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత తక్కువ కాలంలోనే సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ క్రమంలోనే టీడీపీకి దగ్గరయ్యారు. నర్సాపురం నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఈ రెండు పార్టీలోను ఆయన చేరకపోవడం విశేషం. ప్రస్తుతం ఈయన  బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీతో సీట్ల విషయమై.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కాషాయ పెద్దలతో చర్చిస్తున్నారు. పొత్తులో భాగంగా నర్సాపురం లోక్ సభ సీటును బీజేపీకి కేటాయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే నర్సాపురం టికెట్ రఘురామ కృష్ణం రాజుకి ఇచ్చేందుకు బీజేపీ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవికి అవకాశం ఇవ్వాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జాతీయ నాయకత్వానికి సూచించినట్లు సమాచారం.

ఒకవేళ శ్యామలా దేవికి టికెట్ ఇవ్వని పక్షంలో భూపతి రాజు శ్రీనివాస వర్మ ను పోటీకి దించాలని బీజేపీ యోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో నర్సాపురం ఎంపీ టికెట్ రఘురామ కృష్ణం రాజుకు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అర్థం అవుతోంది. అయితే ఇక్కడి నుంచి రఘురామను బరిలో దింపాలని చంద్రబాబు బీజేపీ పెద్దలకు సూచించారు అంట. అయితే  ఈ విషయమై ఆయన బీజేపీ పెద్దలతో చర్చించి వారిని ఒప్పించి పోటీ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: