బాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న బీజేపీ?

కేంద్రంలో బీజేపీ పెద్దలతో టీడీపీ అధినేత భేటీ నిర్వహించి నెల రోజులు కావొస్తోంది. ఇదిలా ఉండగా ఏపీలో ఎన్నికలు చాలా దగ్గరకు వచ్చేశాయి. గట్టిగా 40 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదల చేసి కూడా పదిహేను రోజులు గడుస్తోంది. ఇంత జరుగుతున్నా.. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందా రాదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

టీడీపీ జనసేన ఈ విషయంలో ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి. బీజేపీ కూడా దేశ వ్యాప్తంగా అభ్యర్థలను ప్రకటించి ఏపీని మాత్రం పక్కన పెట్టింది. దాని అర్థం పొత్తులు ఉంటాయనే సంకేతాలు ఇచ్చినట్లే అని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అయితే బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి సిగ్నళ్లు రావడం లేదు. ఒకవేళ పొత్తులకు సానుకూలంగా ఉంటే సంతోష్ కుమార్, శివ ప్రసాద్ లాంటి బీజేపీ ముఖ్య నాయకులు సంప్రదింపులు జరిపే వారు అనే వాదన కూడా ఉంది.

ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ లేట్ అవుతుందో అర్థం కావడం లేదు. మరోవైపు పొత్తు ఉంటుందా ఉండదా.. అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో నిత్యం జరుగుతూనే ఉంది. ఎవరి ఊహాగానాలు వారివి. మరోవైపు తమ కూటమిలోకి వస్తుందని చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా నాలుగు అసెంబ్లీ సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు ఇస్తున్నారని రాయించారు. సోషల్ మీడియా ద్వారా 6-8 ఎంపీ సీట్లు, 8-10 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నట్లు ప్రచారం చేయించారు.

అయితే ఈ ప్రతిపాదనలు ఏమీ పట్టించుకోకుండా బీజేపీ 175 స్థానాల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దాదాపు 3000 మంది దరఖాస్తు చేసుకోగా వారిని వడపోసి ఫైనల్ జాబితాను సిద్ధం చేసే పనిలో అధిష్ఠానం తలామునకలై ఉంది. బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహాలతో టీడీపీ అధినేత చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బీజేపీ పొత్తులో లేదని తెలిస్తే జగన్ తన అధికార బలాన్ని ఉపయోగించి మరింత దూకుడుగా ఎన్నికలకు వెళ్తారు. ఇది టీడీపీ కి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: