టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. బాబు చల్లార్చగలరా?

తెలుగుదేశం సీనియర్లను చంద్రబాబు బుజ్జగించే పనిలో పడ్డారు. టీడీపీ ప్రకటించిన 94 మంది అభ్యర్థుల తొలి జాబితాలో తమ పేరు లేదని చాలామంది సీనియర్లు అసంతృప్తికి గురయ్యారు. జనసేనకు 24 సీట్లు కేటాయించగా..అందులో ఐదుగురి అభ్యర్థిత్వం ఖరారైంది. దీంతో ఈ 99 స్థానాల్లో టికెట్లు కోసం పోటీ పడిన ఆశావహులు, జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లను చంద్రబాబు పిలిచి మాట్లాడుతున్నారు.

వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫలానా పదవి ఇస్తామంటూ ఆఫర్ చేస్తున్నారు. దీంతో కొంతమంది సీనియర్లు మెత్తబడుతున్నారు. అభ్యర్థులకు సహకరిస్తామని హామీ ఇస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలా మంది అసంతృప్తికి గురయ్యారు. కొంతమంది అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. అటువంటి కీలక నాయకులకు చంద్రబాబు టచ్ లోకి వెళ్లారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవినేని ఉమ, పీలా గోవింద, బొడ్డు వెంకట రమణ, గంటా శ్రీనివాసరావు తదితరులను పిలిచి మాట్లాడారు.

పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాట్లు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయింపులకు సహృదయంతో స్వీకరించాలని.. మీకు సముచిత స్థానం కల్పిస్తానంటూ ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా తెనాలి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించారు. ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశించారు. దీంతో ఆయన్ను చంద్రబాబుని పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత లోకేశ్ తో భేటీ అయ్యారు. పొత్తుల సమీకరణాలను తాను అర్థం చేసుకుంటానని రాజేంద్రప్రసాద్ మీడియా వద్ద ప్రస్తావించారు.

దీంతో అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించగా.. అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పీలా గోవింద్ అయ్యన్నపాత్రుడితో కలిసి చంద్రబాబును కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గౌరవ ప్రదమైన పదవి ఇస్తామని ఆయనకు చెప్పారు. రాజానగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణకు రాజమండ్రి ఎంపీ లేదా ప్రత్యామ్నాయ అవకాశం  కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన మెత్తబడ్డారు. దేవినేని ఉమకు సైతం ప్రత్యామ్నాయ సీటు ఇస్తామని చెప్పడంతో ఆయన కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంమీద తొలిజాబితాలో  చెలరేగిన అసంతృప్తి జ్వాలలను చల్లార్చే పనిలో చంద్రబాబు విజయవంతం అయినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: