బాబులాగానే రేవంత్ కూడా చేతులెత్తేస్తారా?

రాజకీయ పార్టీల నాయకులు ప్రకటించే హామీలు తక్షణం అమలు చేస్తారని అనుకోవడం అమాయకత్వం.  ఆయా పార్టీలు ఇచ్చే హామీలు నీటి మీద రాతలు లాగే మిగిలిపోతాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి విజయవంతం అయి ఎన్నికల్లో గెలిచింది. దీంతో పాటు రైతు రుణమాఫీ కూడా 100 రోజుల్లో చేస్తామని ప్రకటించింది.

అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేసింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి  భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయబోతున్నామన్నారు. త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. దీంతో ఈ బడ్జెట్ లో రుణమాఫీ లేదని రైతులు నిరాశ చెందుతున్నారు.

దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా ఇష్ఠాగోష్టిలో మాట్లాడుతూ..రైతులకు తప్పకుండా రుణమాఫీ అమలు చేస్తాం. మొత్తం రుణాన్ని రైతుల నుంచి ప్రభుత్వమే బదిలీ చేసుకొని, వారిని రుణ విముక్తి చేస్తాం. ఈ రుణాన్ని బ్యాంకులకు ప్రభుత్వం పలు దఫాలుగా చెల్లిస్తుంది. దీనిపై బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మహిళలకు వడ్డీ లేని రుణాలను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటాం అని వివరించారు.

సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను బట్ట చూస్తే రుణమాఫీపై ఇంకా ఎటువంటి కార్యచరణ రూపొందించలేదు అని అర్థం అవుతుంది. ఏకకాలంలో చేస్తామని తెలిపి  పలు దఫాలు అని ఇప్పుడు అంటున్నారు. బ్యాంకులతో మాట్లాడటం ఇప్పుడు ప్రారంభిస్తే కొన్ని నెలల తర్వాత వారు ఓ లిస్ట్ ఇస్తారు. దాని బట్టి ఓ అంచనా వేస్తారు. అంత బడ్జెట్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి కేంద్రాన్ని అడుగుతారు. కేంద్రం ఇవ్వకపోతే ఆ నెపాన్ని వారిపై నెట్టి చేతులు దులుపుకుంటారు. గతంలో చంద్రబాబు కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఆ తర్వాత చేతులెత్తేశారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: