మన శంకర వర ప్రసాద్: మెగా ఓపెనింగ్స్‌తో కుమ్ముతోన్న బాస్...!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భారీ సినిమా “మన శంకర వరప్రసాద్ గారు” సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి ఆట నుండే ఈ సినిమా ప్రేక్షకులనుండి అద్భుతమైన సానుకూల స్పందనను దక్కించుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మానియా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం గత 24 గంటల్లోనే బుక్‌మైషో యాప్‌లో 2 లక్షల 86 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోవడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది. ప్రీమియర్ షోల ద్వారా అందిన పాజిటివ్ టాక్ సినిమా వసూళ్లకు పెద్ద ఎత్తున ఊతాన్ని ఇస్తోంది.
రాబోయే పండుగ సెలవులు ఈ చిత్రానికి మరింత కలిసి రానున్నాయి. మెగాస్టార్ తన మార్కు వినోదంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాలో కూడా వినోదానికి పెద్దపీట వేశారు. చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ను ఇంత ఎనర్జిటిక్‌గా చూడటం అభిమానులకు కనువిందుగా మారింది. కేవలం నవ్వులే కాకుండా గుండెలను కదిలించే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఈ సినిమా లో పండటం విశేషం.
ద్వితీయార్థంలో వచ్చే ఎమోషనల్ సీన్లు కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు ఇప్పటికే హిట్‌గా నిలవగా, వెండితెరపై వాటి చిత్రీకరణ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. మాస్ మరియు క్లాస్ అంశాల కలయికతో అనిల్ రావిపూడి పక్కా సంక్రాంతి వినోదాత్మక చిత్రాన్ని అందించారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించి తన నటనతో సినిమాకు గ్లామర్ మరియు వెయిట్ రెండింటినీ తీసుకువచ్చారు. మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెలతో కలిసి సాహు గారపాటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా తెరకెక్కించారు.