ధరణి ఎత్తివేతపై రేవంత్ రెడ్డి సైలంట్.. ఎందుకో?
తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ధరణి స్థానంలో భూమాత అనే పోర్టల్ ను తీసుకొస్తామని హామీలో ప్రకటించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి లో సైతం ధరణిపై భారీగానే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు. దీనిపై సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్లో లోపాలున్నాయని భావించిన కాంగ్రెస్ సర్కారు వీటిని గుర్తించేందుకు ధరణి కమిటీని నియమించింది. ఈ కమిటీ ధరణి పోర్టల్ పై అధ్యయనం చేసి లోపాలు, మార్పులు చేర్పులపై తాజాగా రెవెన్యూ శాఖకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. ధరణిలో పెండింగ్ సమస్యలు తగ్గకపోవడంపై దృష్టి సారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు కమిటీ పేరుతో కాలయాపన చేయడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. ధరణి ని ఉంచుతారా.. లేక లోపాలను అధిగమంచి మార్పులు చేర్పులు చేస్తారా. లేక రద్దు చేస్తే ప్రత్యామ్నాయం ఏమిటో త్వరగా తేల్చేయాలని సూచిస్తున్నారు. మళ్లీ పాత పద్ధతి ఏనా.. మరేదైనా వివాదరహిత సిస్టం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రిజిస్ర్టేషన్లు నిలిచిపోయాయని దీని ప్రభావం ప్రభుత్వం ఆదాయంతో పాటు ప్రజలపై ఉందని వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేస్తున్నారు.