మోదీ ఆధ్యాత్మిక యాత్ర.. ఓట్లు రాలుస్తుందా?

అయోధ్య లో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠకు ముందు ప్రధాని మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించడం, అక్కడి అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం ఆచరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సంప్రదాయ దుస్తులు, రుద్రాక్ష ధరించిన మోదీ పుణ్య స్నానం చేశారు. ఆలయం ఆవరణలోని తీర్థ బావుల పవిత్ర జలాలను ఒంటిపై పోసుకున్నారు.  అనంతరం రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీరాముని జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శించారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న రామ్ కుండా కాలారామ్ ఆలయం, ఏపీలోని లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళ గురువాయర్ ఆలయం, త్రిప్రయార్ రామస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అక్కడ 22 పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం అయోధ్య బయలు దేరి వెళ్లారు. ఆ పదకొండు రోజులు ప్రధాని కఠిన ఉపవాసం చేశారు. కటిక నేలపై శయనించారు.

రామేశ్వరానికి రామాయణంతో సంబంధం ఉంది. శ్రీరాముడు రావణాసురిడిని సంహరించిన తర్వాత ఆ పాపాన్ని పోగోట్టుకునేందుకు రామేశ్వరం సముద్ర తీరంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. అందుకే ఈ ఆలయానికి రామనాథస్వామి ఆలయంగా పేరు వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏటా ఇక్కడికి లక్షలాది మంది వస్తుంటారు.

అయితే ప్రధాని చేసిన ఈ యాత్రపై పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ యాత్ర దక్షిణాదిలో హిందూ చైతన్యం కలిగించేందుకు చేశారని.. తద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు ఇది రాజకీయాలకు సంబంధం లేని యాత్ర అని రాముడితో దేశంలో అనుబంధాన్ని చూపడానికి ప్రధాని చేసిన ప్రయత్నమే అని చెబుతున్నారు.   విమర్శకులు మాత్రం దక్షిణ భారతదేశంలో రాముడు ఎక్కడా కూడా ప్రత్యక్షంగా సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు లేవంటున్నారు. ఈ యాత్ర ఉత్తర భారతదేశంలో ఓట్లు రాలుస్తుందేమో కానీ దక్షిణ భారతంలో ఫలితాలు ఇవ్వకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: