బాబు పన్నిన వ్యూహంలో జగన్‌ చిక్కుతారా?

ఏపీ రాజకీయాల్లో రెండు రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సరికొత్త  రాజకీయ వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిణామాలను అధికార వైసీపీ నిశితంగా పరిశీలిస్తోంది.  జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు తన అస్త్రశస్త్రాలను బయటకి తీసి వైసీపీపై మైండ్ గేమ్ ఆడటం మొదలు పెట్టారు.


జగన్ ను అధికారం నుంచి దింపి మరోసారి తాను సీఎం కావాలని చంద్రబాబు ఉవ్విళూరుతున్నారు. దీనికోసం రాజకీయ ఏకీకరణ తీసుకురాగలిగారు. వామపక్షాలతో సహా కాంగ్రెస్, బీజేపీలను జగన్ పైకి ప్రయోగిస్తున్నారు. చంద్రబాబుకి బీజేపీ మద్దతు లభిస్తే ఇక ఆయన వ్యూహాలకు తిరుగే ఉండదు. ఈ తరుణంలో జగన్ కు చిరాకు తెప్పించే అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారు. గత ఎన్నికల్లో తన వ్యూహాలతో వైసీపీకి విజయం చేకూర్చిన ప్రశాంత్ కిశోర్ ను తన వైపు తిప్పుకొని చంద్రబాబు జగన్ కు గట్టి సవాల్ విసిరారు.


మరోవైపు షర్మిళ ముఖ్యంగా నారా లోకేశ్ కుటుంబానికి కానుక పంపడం సంచలనమే. సినీ రాజకీయ కుటుంబాలకు క్రిస్మస్ గిఫ్ట్స్ పంపడం సహజమే అయినా.. తమకు చిరకాల ప్రత్యర్థి అయిన నారా కుటుంబానికి బహుమతులు పంపడం అనేది రాజకీయ చర్చకు కారణమైంది. 2019 ఎన్నికల్లో బైబై చంద్రబాబు అన్న షర్మిళ ఇప్పుడు అదే కుటుంబానికి కానుకలు పంపడం ఏంటనేది రాజకీయ నాయకులకు అర్థం కావడం లేదు. దీని వెనుక చంద్రబాబు ఉన్నారు అనే వారు లేకపోలేదు.


వీటితో పాటు జగన్ టికెట్లు నిరాకరించిన నేతల్ని తన వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతూనే ఉన్నారు. మరోవైపు టీడీపీ తో కలిసి వచ్చేందుకు కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు. అయితే బీజేపీ తో కాకుండా ఇండియా కూటమిలోకి వస్తే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పినా.. లోలోపల వీరిని మేనేజ్ చేశారు అనే వార్తలే వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కమ్యూనిస్టులకు అనుకూలంగా ఉండే అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ ఉద్యోగులు చేత సమ్మెలు చేపిస్తూ తన మీడియా ద్వారా ప్రభుత్వంపై  ఒత్తిడి తీసుకువచ్చేందకు యత్నిస్తున్నారు. మొత్తం మీద జగన్ చుట్టూ ఒక వలను అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా పన్నారు. మరి జగన్ వీటిని అధిగమిస్తారా లేదా చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: