ఏపీ అంటే రెండు కులాలు, రెండు పార్టీలేనా?
మరోవైపు తెలంగాణలో ముగిసే సరికి అక్కడి పరిస్థితులను ఇక్కడ పరిస్థితులను రాజకీయ పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. ఏపీలో రాజకీయం రెండు పార్టీలు, ఇద్దరు వ్యక్తులు, రెండు కులాల మధ్య కేంద్రీకృతమైంది. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య జరిగాయి. అక్కడ మాదిరిగా ఇక్కడ కుల రాజకీయాలు పెద్దగా జరగవు. చాలా చోట్ల త్రిముఖ పోటీ నెలకొంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 39 సీట్లలో గెలిస్తే మరో జాతీయ పార్టీ బీజేపీ 8 స్థానాలు కైవసం చేసుకొని 19 స్థానాల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ గట్టిగానే ప్రభావం చూపింది. ఇక ఏపీ విషయానికొస్తే బీజేపీ ప్రభావం చాలా తక్కువ. అక్కడ సగానికి పైగా స్థానాల్లో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరు. పోటీ ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే ఉండనుంది.
రాయలసీమలో రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ వైసీపీ బలంగా ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చే సరికి కాపు, కమ్మ, రాజులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ టీడీపీ, జనసేన అభ్యర్థులకు కొంత అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉండదు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలుపొందడానికి ముఖ్య కారణం నగర అభివృద్ధితో పాటు ఎంఐఎంతో పొత్తు కొన్ని చోట్ల బీజేపీ బలంగా ఉండటం. అందువల్ల తెలంగాణ ఏపీ రాజకీయ పరిస్థితులు వేరు. పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏపీలో రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంటుంది.