ఏపీ విభజన హామీలు: జగన్, బాబు.. ఎవరికీ పట్టదా?

తెలుగు రాష్ట్రాలు విడిపోయి తొమ్మిది ఏళ్లు గడుస్తోంది. ఇంకా విభజన హామీలు అమలు కాలేదని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.  ఈ అంశాలను రాజకీయ నాయకులు తమ అవసరాలకు వాడుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో ఎవరూ పనిచేయడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  


వైసీపీని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేరుస్తానని ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆయనే కేంద్రం వద్ద మెడలు వంచి ఉన్నారు.  ఇప్పుడు ఏపీలో ఉన్న రెండు ప్రధాన పార్టీలకు కేంద్రంలోని బీజేపీ అంటే భయం, భక్తి రెండూ ఉన్నాయి. 2019 కి ముందు కేంద్రంలోని బీజేపీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని ఎందుకు చేయడం లేదు. మరోవైపు ఇండియా కూటమి ఎన్డీయేకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ వైపు నిలబడ్డారు. అప్పుడు ప్రత్యేక హోదా షరతులు ఎందుకు విధించలేదు. విభజన హామీలు అమలు చేస్తేనే మేం ఓటేస్తాం అని కనీసం బీజేపీతో చెప్పలేదు.


టీడీపీ విషయానికొస్తే అధికార వైసీపీకి భిన్నమైన వైఖరి ప్రదర్శించాలి. కానీ రెండు పార్టీలు ఎన్డీయే కూటమికి తమ విధేయతను చాటుకుంటున్నాయి. 2019లో ధర్మ పోరాటం పేరిట అవిశ్వాస తీర్మానం పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు.


పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు టీడీపీ, వైసీపీలు అనుకూలంగా ఓటేస్తున్నాయి. ఏపీపై చిన్నచూపు చూస్తున్న బీజేపీని ప్రశ్నించకుండా తమ రాజకీయ స్వార్థం కోసం రెండు పార్టీలు రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టాయి.  వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టు, దుగ్గిరాజపట్నం  పోర్టు, రాజధాని నిర్మాణం తో పాటు పలు హామీలను కేంద్రం విస్మరించింది. అయినా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నాయి.  ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేకున్నా.. పోటీపడి మరీ కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు ఓటేస్తున్నారు.  దీనిపై  ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: