కర్ణాటక ఎఫెక్ట్.. తెలంగాణాలో రిపీట్ అవుతుందా?
పేదలకు సంక్షేమ పథకాలు కావాలి. అందుకే వారు ఏ పార్టీ ఎక్కువ హామీలు ఇస్తే వారికే ఓటు వేస్తారు. వారికి మౌలిక సదుపాయాలు, ఉద్యోగ కల్పన తదితర అంశాల గురించి ఆలోచించరు. తాజాగా తెలంగాణలో కూడా కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ పోటీపడి తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. కాంగ్రెస్ ఏమో కర్ణాటక తరహా ఇక్కడ కూడా గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెబుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తోంది.
అయితే సంక్షేమ పథకాలకు బీజేపీ కొంత వ్యతిరేకం. ఈ విషయాన్ని ప్రధాని మోదీ కూడా అంగీకరించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ పరిపాలన సాగించింది. కాంగ్రెస్ తమ మేనిఫెస్టో లో సంక్షేమం గురించి ప్రస్తావించగానే జనం అంతా వాటికి ఆకర్షితులై కాంగ్రెస్ ను గెలిపించారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.
కర్ణాటకలో అధికార పార్టీ ఎమ్మెల్యే నిధులన్నీ సంక్షేమానికే ఖర్చు అవుతున్నాయని.. అభివృద్ధి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని బట్టే అర్థం అవుతుంది అక్కడ పరిస్థితి ఏంటో. వీటికి నిధులు సమకూర్చుకునేందుకు కరెంట్ ఛార్జీలు, ఇతర పన్నులు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణాలో కూడా ఇదే తరహా ఎన్నికల ప్రణాళికలను కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ప్రకటించాయి. చూద్దాం తెలంగాణలో ఏం జరుగుతుందో.