
ఆ నాయకురాలి కులం తేల్చండి.. హైకోర్టు షాక్?
అయితే ఇది కొత్తేమీ కాదు.. తాజాగా గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ క్రిస్టీనా, ఆమె భర్త వైసీపీ నాయకుడు కత్తెర సురేశ్ కుమార్ కులాన్ని తేల్చాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ సమర్పించే తాజా వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. క్రిస్టీనా, ఆమె భర్త ఎస్సీలేనంటూ ధ్రువీకరిస్తూ కలెక్టర్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టురద్దు చేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ హెని క్రిస్టీనా, ఆమె భర్త కత్తెర సురేశ్‌కుమార్ కు చెందిన ఎస్సీ కుల ధ్రువీకరణపత్రం రద్దు చేయాలని కోరుతూ చేసిన విన్నపాన్ని జిల్లా కలెక్టర్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ కొల్లిపర గ్రామానికి చెందిన ఎం. సరళకుమారి 2021లో హైకోర్టును ఆశ్రయించారు. ఈవాజ్యంపై విచారణ సందర్భంగా న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. క్రిస్టీనా, అమె భర్త ఎస్సీలు కాదని ఆయన వాదించారు.
వారు క్రైస్తవంలోకి మారినందున ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని జడ శ్రావణ్ కుమార్ వాదించారు. క్రైస్తవ ప్రచారం కోసం ‘హార్వెస్ట్ ఇండియా’ సంస్థను నిర్వహిస్తున్నారన్నారు. వారు క్రిస్టియన్లు అని చెప్పేందుకు పలు సాక్ష్యాలున్నాయన్నారు. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో రెవెన్యూ అధికారులు విచారణ సరిగా చేయకుండా కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. విచారణ చేసే బాధ్యతను కిందిస్థాయి సిబ్బందికి అప్పగించడం చట్ట విరుద్దమన్నారు. బాప్టిజం పొందిన ఫైల్, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ ధ్రువపత్రం రద్దు చేసేలా కలెక్టర్‌ను ఆదేశించాలని కోరారు.