తిరుపతి లడ్డూ - షాకింగ్ వీడియో.. నిజమేనా?

తిరుమల శ్రీవారి లడ్డు పరిమాణం కంటే తక్కువ ఉంటోందా.. 160 నుంచి 180 ఉండాల్సిన తిరుపతి లడ్డూ బరువు తగ్గించేశారా.. ఇప్పుడు వంద గ్రాములు కూడా రావడం లేదా.. ఈ మేరకు ఇటీవల ఓ భక్తుడు చిత్రీకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. లడ్డు ప్రసాద విక్రయ కేంద్రం వద్ద తాను కొనుగోలు చేసిన లడ్డు ప్రసాదాన్ని రెండు మూడు సార్లు పరిశీలించినా నిర్దిష్ట బరువుకంటే తక్కువగా చూపించినట్టు ఆ వీడియోల్లో ఉంది.

భక్తుడు లడ్డూ ప్రసాదం తీసుకునేందుకు కేంద్రం వద్దకు వెళ్లినట్టు.. లడ్డూ కొనుగోలు చేసే సమయంలో వాటి బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చి బరువు వేయాల్సిందిగా కౌంటర్లో ఉన్న సిబ్బందిని కోరినట్టు.. భక్తుడు కోరిక మేరకు సిబ్బంది తూకం వేయడంతో  నిర్దేశించిన బరువు కంటే తక్కువ ఉన్నట్టు..దీంతో సిబ్బందిపై భక్తుడు ఆగ్రహం చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది.

దీంతో ఈ అంశంపై టీటీడీ వివరణ ఇచ్చింది. దృశ్యాలు వైరల్ కావడంతో విజిలెన్స్, ఆలయ పోటు, లడ్డూ కేంద్రాల్లోని అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రతి కేంద్రంలోకి వెళ్లి లడ్డూలను తూకం వేసి పరిశీలించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం సాధారణంగా 160 నుంచి 180 గ్రాముల బరువు ఉంటుందని తెలిపారు. దీనిపై ఎలాంటి అపోహలు వద్దంటూ టీటీడీ ప్రకటన జారీ చేసింది. లడ్డు తయారీ, విక్రయాలపై వివరణ ఇచ్చింది. పోటు కార్మికులు తయారుచేసిన లడ్డూ ప్రసాదాలను ఒక ట్రేలో ఉంచి పోటు అధికారులు బరువును తనిఖీ చేస్తారని తెలిపింది.

ఆ తర్వాత లడ్డూ ప్రసాదాలను కౌంటర్లకు తరలించి, భక్తులకు అందిస్తారని టీటీడీ అధికారులు ప్రకటించారు. బరువు తూచే యంత్రంలో  సాంకేతిక సమస్యతో పాటు సిబ్బంది అవగాహన లోపంతో లడ్డూ బరువుపై భక్తులు అపోహకు గురయ్యారని టీటీడీ అధికారులు వివరించారు.  వందల సంవత్సరాలుగా పోటు కార్మికులు అత్యంత భక్తి శ్రద్ధలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. బరువు, నాణ్యత విషయంలో రాజీపడలేదని వారు తెలిపారు. లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: