ఇప్పటం.. న్యాయ పోరాటం ఫలిస్తుందా..?

ఇప్పటం.. గుంటూరు జిల్లాలోని ఓ చిన్న గ్రామం.. కానీ ఇప్పుడు ఈ ఊరు పేరు బాగా వార్తల్లోకి వచ్చింది. ఆ ఊళ్లో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూలగొట్టడం అందుకు ప్రథమ కారణం అయితే.. వారిని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ రావడంతో ఈ పేరు ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకే వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టి ఇళ్లు కూల్చేసిందని ఇప్పటం వాసులు ఆరోపిస్తున్నారు. మొత్తం 31 మంది రైతులు తమ భూములను సభ, పార్కింగ్ కోసం ఇచ్చారని...అప్పటి నుంచి ప్రభుత్వం తమపై కక్ష గట్టిందని ఇప్పటం వాసులు చెబుతున్నారు.

మార్చిలో జనసేన సభ జరిగింది. ఏప్రిల్ 22న మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు ఈ గ్రామంలోని 50 మందికి నోటీసులు ఇచ్చారు. 1920కి ముందు ఉన్న గ్రామ పటాల ఆధారంగా రహదారి ఆక్రమణకు గురైందని నోటీసుల్లో పేర్కొన్నారట. వెంటనే స్థానికులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసి సమస్యను వివరించారని... గ్రామంలో ఇప్పటికే మురుగునీటి డ్రైన్‌లు నిర్మించారని... ఎక్కడా అక్రమణలు జరగలేదని చెప్పామని వారు చెబుతున్నారు.

అయితే.. రామకృష్ణారెడ్డి.. అందరి అభిప్రాయంతోనే ముందుకు వెళ్తామని హామీ ఇచ్చినా.. ఇళ్ల కూల్చివేతకు ఆయనే అధికారులను పంపించారని ఇప్పటం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేసిన ప్రభుత్వం, అధికారులు పరిహారం ఇచ్చే వరకూ ఊరుకోబోమని గ్రామస్తులు చెబుతున్నారు. వైసీపీ సర్కారు చేసిన ఈ అన్యాయంపై న్యాయపోరాటం చేస్తామని ఇప్పటం వాసులు తేల్చిచెప్పారు.

త్వరలోనే పరిహారం కోసం ఇప్పటం గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు జనసేన కూడా తగిన న్యాయ సహాయం అందించేందుకు రెడీ అవుతోంది. రాజకీయ కక్షతో చేసిన నష్టానికి పరిహారం ఇవ్వాల్సిందేనని బాధితులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ రాజకీయ క్రీడలో తమను బలి పశువులను చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటం వాసుల న్యాయ పోరాటం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: