అటెన్షన్ జగన్: కడప జిల్లాలో వైసీపీ నేతల కబ్జా బాగోతం?
ఇప్పుడు కడప జిల్లాలో అదే జరుగుతోంది. మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామంలో 304 ఎకరాల ప్రభుత్వ భూమిని వైకాపా ఎమ్మెల్యే, అనుచరులు ఆక్రమించారని టీడీపీ నేతలు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. సర్వే నంబరు 506, 507లో 304 ఎకరాల అటవీ భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించారని వారు ఆరోపించారు. దీనిపై స్థానికంగా అధికారులకు కంప్లయింట్లు కూడా ఇచ్చారు. అయితే.. వైసీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అంతా చట్టప్రకారమే ఉందని చెప్పుకొచ్చారు.
ఈ పరిస్థితుల్లో విషయం చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందుకు వెళ్లింది. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ చెన్నై ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా వైసీపీ నేతల భూకబ్జాలను తప్పుబట్టిందని మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ అంటున్నారు. పూర్తి స్థాయి విచారణ చేసిన ఎన్జీటీ కోర్టు... ఈనెల 2న సుదీర్ఘమైన ఉత్తర్వులు జారీ చేసిందని పుట్టా సుధాకర్ యాదవ్ కడపలో మీడియా సమావేశంలో వెల్లడించారు.
మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆక్రమించిన 304 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆరు నెలల్లోగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రెబ్యునల్ ఆదేశాలు జారీ చేసిందని పుట్టా సుధాకర్ యాదవ్ అంటున్నారు. ఈ కోర్టు తీర్పు వైసీపీ నాయకులకు చెంపపెట్టు లాంటిదని ఆయన చెబుతున్నారు. ఈ ఎన్జీటీ తీర్పు విషయం నిజమే అయితే.. ఇది జగన్ సర్కారు మేలుకోవాల్సిన సమయం.. వచ్చేసింది. ఇలాంటి భూకబ్జాలను ప్రోత్సహిస్తే.. ప్రజలు అసహ్యించుకునే ప్రమాదం ఉంది. మరి జగన్ ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.