పాపం.. ఎలాంటి చంద్రబాబు.. ఎలా అయిపోయారు?

చంద్రబాబు.. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు.. ఎప్పుడో.. పాతికేళ్ల క్రితమే తొలిసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత తక్కువ కాలంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సంకీర్ణ యుగంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. దేశ స్థాయిలో నాయకులను కూడగట్టడంతో చర్చలు జరపడంలో చక్రం తిప్పారు. ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు వంటి వారి ఎంపికలోనూ కీలక  పాత్ర పోషించారు.

అయితే.. అదంతా ఘనమైన గతంగానే మిగిలిపోతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏమంత బాగా లేదు. చివరకు ఢిల్లీకి ప్రధాని జాతీయ కార్యక్రమం మీద ఆహ్వానిస్తే.. దాన్ని కూడా ఘనంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇటీవలి కాలంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎట్టకేలకు హస్తినలో గడిపే అవకాశం మొన్న వచ్చింది. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాల కారణంగా చంద్రబాబుకు ఈ అవకాశం వచ్చింది.

చివరకు మీరు తరచూ ఢిల్లీకి ఎందుకు రావడం లేదు? అని చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ అడిగే పరిస్థితి వచ్చింది. అయితే.. ప్రధాని మోదీ చెప్పినట్టు చంద్రబాబు ఒక్క ఢిల్లీకే కాదు, ఏపీ రాజధాని అమరావతికి కూడా రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  చంద్రబాబును ఢిల్లీకి రమ్మని పిలిచేవారు ఎలాగూ లేరు. అలాగే ఆయన్ను అమరావతిలో ఉండాలని అడిగేవారూ లేరంటున్నాయి వైసీపీ వర్గాలు.

ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబును పట్టించుకునేవారే కరవుయ్యారు.  యూపీ, బిహార్‌ ను గతంలో పరిపాలించిన పూర్వపు జనతా పరివార్‌ పార్టీలు కూడా బాబును పట్టించుకోవట్లేదు. అయితే..  చంద్రబాబు కప్పదాటు ధోరణే ఆయన్ను జాతీయ రాజకీయాల్లో ఏకాకిని చేసిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అమెరికా అధ్యక్షులతో సైతం మాట్లాడడానికి ప్రయత్నించే బాబు ఇప్పుడు రాజకీయంగా ఒంటరి అయ్యారు. మరి మళ్లీ చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పే రోజులు వస్తాయా.. ఢిల్లీ సంగతి పక్కన పెడితే.. ముందు అమరావతిలో మళ్లీ ఆయన ప్రభ వెలుగుతుందా.. లేక.. గత వెలుగులే స్మృతులుగా కాలం గడపాల్సిందేనా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: