నాగబాబు చెబుతున్నారు సరే.. చిరు మద్దతు ఉంటుందా?

చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఆయన తమ్ముళ్లు పవన్, నాగబాబు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. మరి పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు ఉంటుందా అన్నది ఓ డౌట్‌.. దీన్ని నిన్న నాగబాబు క్లియర్ చేశారు. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పిన నాగాబబు.. ఆయనకి సినిమాలంటే ప్యాషన్ అందుకే రాజకీయాల జోలికి రావడం లేదని తేల్చి చెప్పారు.

కానీ రాజకీయాల్లోకి రాకపోయినా చిరంజీవి మద్దతు మాత్రం జనసేనకే ఉంటుందని నాగబాబు అన్నారు. ఇక పొత్తులపై అన్నీ ఆలోచించి మా నాయకుడు నిర్ణయం తీసుకుంటాడని.. విజయనగరం జిల్లాలో పర్యటించిన జనసేనపార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు అంటున్నారు. విజయనగరంలోని ఎస్.వి.ఎన్ లేక్ ప్యాలెస్ హోటల్లో  విజయనగరం, పార్వతీపురం జిల్లా జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నాగబాబు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

ఉత్తరాంధ్ర జన సైనికులను చూడడానికి... వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు అవగాహన పెంచుకునేందుకు తాను ఇలా జిల్లా పర్యటనకు వచ్చానని నాగబాబు అంటున్నారు. అవును నిజమే కదా.. హైదరాబాదులో కూర్చొని ఎవ్వరో చెప్పింది తెలుసుకోవడం కంటే నేరుగా తెలుసుకుంటే బెటర్ కదా.. నాగబాబు కూడా అదే మాట అంటున్నారు. ఈ పర్యటన ద్వారా క్షేత్ర స్థానంలో పార్టీ పరిస్థితి తెలుసుకొనే అవకాశం వచ్చిందంటున్నారు.

జనసేన కార్యకర్తలలో మంచి జోష్ ఉందని.. నియోజకవర్గల వారీగా చాలా సమస్యలు లేవనెత్తారని నాగబాబు కార్యకర్తలను ప్రశంసించారు. అయితే.. నాయకులలో చిన్నచిన్న విభేదాలు ఉన్నాయని.. వాటినన్నింటీని పరిష్కరించుకొని బలం పెంచుకుంటామని నాగబాబు అంటున్నారు. రాష్ట్రంలో విస్తారంగా ఖనిజ సంపద ఉందని..  దాన్ని దోచుకుంటున్నారని.. ప్రజల కోసం ప్రస్తుత నాయకులు పనిచేయడం లేదని... ఋషికొండ వంటి చారిత్రాత్మక ప్రదేశాలను నాశనం చేస్తున్న వైసిపి తమకు ప్రధాన శత్రువు అని నాగబాబు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: