పాపం.. చంద్రబాబుకు అది ఎప్పటికైనా మైనస్సే?
డిజైన్లు, గ్రాఫిక్స్, మాస్టర్ ప్లాన్లు.. అంటూనే ఆయన మూడు, నాలుగేళ్లు గడిపేశారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి.. చూస్తే అటు అమరావతికి ఆకృతే లేకుండా పోయింది. ఇక ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మూడు రాజధానుల పాట ఎత్తుకున్నారు. అయితే.. ఇక్కడ చంద్రబాబుకు ఓ అంశం బాగా మైనస్‌గా మారింది. ఉమ్మడి ఏపీ సీఎంగా హైదరాబాద్‌ను బాగా అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబుకు.. ఆంధ్రప్రదేశ్‌లో సొంత చిరునామా లేకపోవడం వైసీపీ నేతలు విమర్శించేందుకు ఆస్కారం ఇస్తోంది.
చంద్రబాబు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్‌లోనే కొత్త ఇల్లు కట్టుకున్నారు తప్పించి.. విజయవాడలో కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మరెక్కడైనా కానీ.. స్థిర నివాసం మాత్రం ఏర్పాటు చేసుకోలేదు. అదే సమయంలో ఆనాటి విపక్ష నేత జగన్.. రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రకటించిన వెంటనే తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం గురించి ఏ అంశంపై విమర్శ వచ్చినా.. అసలు మీ నాయకుడికి ఏపీలో అడ్రస్సు ఉందా అని వైసీపీ నేతలు ప్రశ్నించే దుస్థితి దాపురించింది.
వైసీపీ నేతల మాటల్లో చెప్పాలంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ నెంబర్ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆంధ్ర రాష్ట్రంలోని సొంత అడ్రస్ ఎక్కడో చెప్పలేని నాయకుడు చంద్రబాబు నాయుడు. ఏపీలోనే తన భవిష్యత్ రాజకీయం అని పక్కాగా తెలిసిన చంద్రబాబు, లోకేశ్‌లు ఎందుకు అమరావతి ప్రాంతంలో అద్దె ఇంటిలో కాకుండా సొంత ఇల్లు ఎందుకు నిర్మించుకోలేదన్నది అర్థం కాని విషయం. ప్రత్యర్థులు తిట్టేందుకు మాత్రం ఇది ఆస్కారం ఇస్తోంది. ఇది చంద్రబాబుకు ఎప్పటికైనా మైనస్ పాయింటే.