టీడీపీలో ఆయ‌న ఓ క‌రివేపాకు అయిపోయాడా..?

VUYYURU SUBHASH
ఏపీలో ప్ర‌తిప‌క్ష తెలుగు దేశం పార్టీ ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతోన్న క్ర‌మంలో చాలా మంది కీల‌క నాయ‌కుల‌ను పార్టీ అధిష్టానం ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఎవ‌రికి వారు త‌మంత‌ట తాము పార్టీ స్టాండ్ తీసుకుని ముందుకు వ‌చ్చి పోరాటాలు చేస్తే త‌ప్పా ఎవ‌రిని కూడా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ లిస్టులోనే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగ‌ల్రాయుడు కూడా ఉన్నారు. ఒక‌ప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన ఆయ‌న ఆ త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఆయ‌న సినియార్టీని వాడుకోవాల‌ని.. పైగా క‌డ‌ప జిల్లాలో బ‌లిజ‌ల ఓట్ల‌ను కొల్ల‌గొట్టాల‌ని చెంగ‌ల్రాయుడు కు రాజంపేట సీటు ఇచ్చారు.

అయితే ఆ ఎన్నిక‌ల్లో చెంగ‌ల్రాయుడు ఓడిపోయారు. ఆయ‌న ప్ర‌స్తుతం రాజంపేట టీడీపీ ఇన్‌చార్జ్ గా కొన‌సాగుతున్నారు. అయితే ఆయ‌న  స్వ‌స్థ‌లం రాజంపేట స‌మీపంలోని రైల్వేకోడూరు. ఈ ప్రాంతంలో ప‌ట్టున్న బ‌లిజ నేత చెంగ‌ల్రాయుడు. ఆయ‌న‌కు రాజంపేట‌, రైల్వేకోడూరుల‌లో బ‌ల‌మైన బ‌లిజ ( కాపు ఉప‌కులం) సామాజ‌క వ‌ర్గం అండ‌దండ‌లున్నాయి. ఒక‌ప్పుడు వైఎస్ రాజారెడ్డితో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డిన నేత‌గా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది.

ఆ త‌ర్వాత వైఎస్ అండ‌దండ‌ల‌తో కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ అయ్యారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి వైసీపీలో చేర‌డంతో చంద్ర‌బాబుకు గ‌తి లేక చెంగ‌ల్రాయుడ‌కు సీటు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయ‌న్ను రాజంపేట నుంచి సాగ‌నంపేస్తార‌ని అంటున్నారు. ఆయ‌న్ను రైల్వేకోడూరుకు ప‌రిమితం చేసి.. రాజంపేట నుంచి రెడ్డి వ‌ర్గంలో ఆర్థికంగా బ‌ల‌వంతుడు అయిన ఓ నేత‌కు సీటు క‌ట్ట‌బెట్టే ఆలోచ‌న‌లో బాబు ఉన్నార‌ట‌.

మీరు రాజంపేట‌పై ఆశ‌లు వ‌దుల‌కోండి... మీ సొంత నియోజ‌క‌వ‌ర్గం రైల్వేకోడూరుకు వెళ్లి టీడీపీని బ‌లోపేతం చేయాల‌ని బ‌త్యాల‌కు సూచించిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల‌లో గెలిచి ఎమ్మెల్యే అవ్వాల‌ని ఆశ‌లు పెట్టుకున్న చెంగ‌ల్రాయుడు కోరిక నెర‌వేరేలా లేదు. ఇక ఇప్ప‌టికే రాయ‌చోటిలో శ్రీనివాస్ రెడ్డి ఫ్యామిలీకే టీడీపీ సీటు ఇవ్వాలి.. ఇప్పుడు రాజంపేట సీటు కూడా రెడ్ల‌కే ఇస్తే.. బ‌లిజ‌ల ఓట్లు కూడా టీడీపీకి ఉండే అవ‌కాశాలు త‌క్కువుగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: