అమరావతి: జగన్ ఏం చేయబోతున్నారంటే?
ఎవరెన్ని చెప్పినా.. మూడు రాజధానులే తమ విధానం అని వైసీపీ సర్కారు పదే పదే చెబుతోంది. నిన్న కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మంత్రి బొత్స మూడు రాజధానులే తమ విధానం అని పునరుద్ఘాటించారు. మరి ఈ నేపథ్యంలో అసలు జగన్ ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి.. ఆయన ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది.
జగన్ ముందు ఉన్న మొదటి ఆప్షన్.. హైకోర్టు చెప్పినట్టు చేయడం.. ఇలా చేయడం జగన్కు ఏమాత్రం ఇష్టం లేనే లేదు.. దీనికి తోడు ఇప్పటికిప్పుడు రాజధాని భూములను అభివృద్ధి చేసి ఇవ్వడం సాధ్యం కాని పని.. అందులోనూ అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం.. వేల కోట్లు అవసరం.. ఇప్పుడు అంత డబ్బు రాజధానిపై వెచ్చించే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ ఆప్షన్ను జగన్ పరిశీలించరు.
మరో ఆప్షన్.. ఈ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడం.. అయితే ఈ అంశాన్ని కూడా జగన్ సర్కారు సీరియస్గా పరిశీలిస్తోంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో తమకు వ్యతిరేకమైన శక్తులు కీలక స్థానాల్లో ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. అక్కడకు వెళ్లినా అనుకూలమైన తీర్పు రాకపోగా.. మరింత ప్రతికూలంగా పరిస్థితులు మారవచ్చని భావిస్తోంది. అందువల్ల ఇప్పట్లో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లకుండా ప్రస్తుతానికి కాలం దొర్లించడమే మంచిదన్న భావన వైసీపీ వర్గాల్లో ఉంది. ఈ ఆగస్టు వరకూ ఎదురు చూసి.. ఆ తర్వాత ఈ విషయంలో ముందుకు వెళ్లడం మంచిదన్న భావన కూడా ఉంది. ఆగస్టు వరకూ ఏదో ఒకటి చెబుతూ హైకోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు కనిపించడమే మేలన్న అభిప్రాయం ఉంది. చూడాలి ఈ ఆప్షన్లలో జగన్ దేన్ని ఎంచుకుంటారో..?