టాలీవుడ్ టెన్షన్: టికెట్ రేట్ల గొడవ జగన్ ఇవాళ తేల్చేస్తారా..?
ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ సినీవర్గాల్లో నెలకొంది. టికెట్ల ధరలపై సినీప్రముఖుల అభిప్రాయాలు తీసుకున్న ప్రభుత్వం.. ఆ వివరాలు కమిటీకి అందజేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తుదినివేదిక తయారు చేసిన కమిటీ ఇవాళ దాన్ని ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది.
ఇటీవల చిరంజీవి నేతృత్వంలో సినీ బృందం సీఎం జగన్‌తోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సినీ ప్రముఖులు సమస్య పరిష్కారం అయినట్టే మీడియాకు చెప్పారు. సినిమా సమస్యలకు శుభం కార్డు పడిందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈనెలాఖరుకు జీవో వస్తుందని కూడా చిరంజీవి నమ్మకంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తుది నిర్ణయం ఎలా తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
సినీ పరిశ్రమ పెద్దలను తన వద్దకు రప్పించుకుని చర్చించిన సీఎం ఈ విషయంలో వారిని నిరాశపరచకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. సినీ పరిశ్రమ మొదటి నుంచి సీఎం జగన్‌ను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. అందుకే సినిమా టికెట్ల రేట్లు తగ్గించి.. ప్రత్యేక షోలకు అనుమతులు నిరాకరించి జగన్ సర్కారు సినీ పరిశ్రమ పెద్దలను ఇబ్బందులకు గురి చేశారన్న వాదన కూడా ఉంది.
ఇప్పుడు చిరంజీవి సహా ఏకంగా సూపర్ స్టార్లు, మెగాస్టార్లుగా పేరున్న మహేశ్ బాబు, ప్రభాస్ వంటి స్టార్లు సైతం వచ్చి జగన్ ముందు కూర్చుని మాట్లాడడటంతో ఇక జగన్ సర్కారు పెద్దగా వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణ సినిమాలకు ఒకరేటు.. పాన్ ఇండియా సినిమాలకు మరో రేటుగా నిర్ణయించే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదో షోకు అనుమతించిన ప్రభుత్వం పాన్ ఇండియా సినిమాల ప్రత్యేక షోలపైనా సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.