మళ్లీ ఏపీలో తెలంగాణ కలిపేయడం సాధ్యమేనా..?
అయితే.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం మరోసారి చర్చల్లోకి వచ్చిందంటే..అది మోడీ పార్లమెంటులో చేసిన ప్రసంగం చలవే.. ఏపీని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందని.. పార్లమెంట్ తలుపులు మూసి.. లైట్లు తీసి బిల్లు పాస్ చేశారని.. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ నుంచి తీర్మానం లేకుండానే విభజించారని.. ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ను విమర్శించేందుకు మోడీ ఈ ఎత్తుగడ వేశారు.
ఇప్పుడు బీజేపీ అంటే మండిపడుతున్న టీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలను బాగా రాజకీయం చేసుకుంటోంది. అదిగో బీజేపీ వాయిస్ చూశారా.. వాళ్లకు తెలంగాణ ఇవ్వడమే ఇష్టం లేదు.. మళ్లీ బీజేపీకి అధికారం ఇస్తే.. ఏపీలో మళ్లీ తెలంగాణను కలిపేసినా కలిపేస్తారు అంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు. మరి నిజంగా అలా జరుగుతుందా.. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారా.. అది సాధ్యం అవుతుందా.. అన్న చర్చ కూడా జరుగుతోంది.
ప్రత్యేక రాష్ట్రం అంటూ ఒకటి ఏర్పడిన తర్వాత మళ్లీ దాన్ని రద్దు చేసి మాతృ రాష్ట్రంలో కలపడం అన్నది భారత దేశ చరిత్రలోనే జరగలేదు.. అయితే రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంది. పార్లమెంటులో గంపగుత్త మెజారిటీ ఉంటే అది అసాధ్యమేమీ కాదు.. కానీ.. అసలు ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోవడానికే వందల మంది ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర తెలంగాణది.. అలాంటిది ఓసారి రాష్ట్రం వచ్చాక దాన్ని రద్దు చేస్తే.. తెలంగాణ సమాజం ఊరుకుంటుందా.. అంతటి సాహసం ఏ ప్రభుత్వం కూడా చేయదు..మరి ఏంటి ఇదంతా అంటే.. అదంతే.. అదో రాజకీయం.. అంతే..