కొమ్మాల‌పాటి క్రెడిట్ కొట్టేశాడుగా...!

VUYYURU SUBHASH
ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజ‌న్ల మార్పు అంశం పెద్ద వివాదంగా మారుతోన్న సంగ‌తి తెలిసిందే. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులే కొన్ని చోట్ల త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తామ‌ని చెపుతున్నారు. రాయ‌చోటి జిల్లాపై ఆ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు రాజీనామాలు చేస్తామ‌ని ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ వాళ్లు త‌మ ప్రాంత ప్ర‌జ‌ల నుంచి ఎంత వ్య‌తిరేక‌త‌, విమ‌ర్శ‌లు వ‌స్తున్నా అధిష్టానానికి భ‌య‌ప‌డో.. మాకు ఎందుకు వ‌చ్చింది.. ప్ర‌జ‌లే క‌దా ఇబ్బందులు ప‌డేది అని కిమ్మ‌న‌డం లేదు. ఇలాంటి చోట్ల ప్ర‌తిప‌క్ష టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు మాత్రం ప్ర‌భుత్వంపై పోరు స‌ల్పుతూ విజ‌యం సాధిస్తున్నారు.
కీల‌క‌మైన గుంటూరు జిల్లాను మూడు ముక్క‌లు చేశారు. న‌ర‌సారావుపేట కేంద్రంగా ఏర్ప‌డిన ప్ర‌త్యేక ప‌ల్నాడు జిల్లాపై ఆ ప్రాంత ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అస‌లు ప‌ల్నాడు ప్రాంతంలో న‌ర‌సారావుపేట లేద‌ని.. చ‌రిత్ర కూడా ఇదే చెపుతోంద‌ని.. అలాంటిది న‌ర‌సారావుపేట‌ను ప‌ల్నాడు జిల్లా హెడ్ క్వార్ట‌ర్‌గా ఎలా చేస్తార‌ని తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప్రభుత్వం ప‌ట్టించుకోలేదు. ఇక ఈ జిల్లాలో ఉన్న పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌లాల‌ను వంద కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న గుర‌జాల రెవెన్యూ డివిజ‌న్లో చేర్చారు.
పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం గుంటూరుకు ఎటు చూసినా 30 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. అలాంటిది గుంటూరు డివిజ‌న్ నుంచి వేరుచేసి గుర‌జాల డివిజ‌న్లో క‌ల‌ప‌డంతో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌లాల‌ను గుంటూరు రెవెన్యూ డివిజ‌న్లోనే క‌ల‌పాల‌న్న డిమాండ్‌ను ముందుకు తీసుకురావ‌డంతో పాటు దీనిని ఉద్య‌మంగా మ‌లిచే ప్ర‌య‌త్నం చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఆయ‌న గుంటూరు ముద్దు.. గుర‌జాల వ‌ద్దు నినాదాన్ని బ‌లంగా ఎత్తుకున్నారు.
లేనిప‌క్షంలో స‌త్తెన‌ప‌ల్లి, పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ స‌త్తెన‌ప‌ల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజ‌న్ అయినా ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న కోరారు. త‌క్కువ టైంలోనే నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అంద‌రూ కొమ్మాల‌పాటి ఎత్తుకున్న నినాదం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింది. దీంతో ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గింది. పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో పెద‌కూర‌పాటు - అచ్చంపేట - క్రోసూరు - అమ‌రావ‌తి మండ‌లాల‌ను  నరసారావు పేటలో  క‌లుపుతూ మార్పులు చేసింది.
ఏదేమైనా ఈ క్రెడిట్‌లో చాలా వ‌ర‌కు మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి ఖాతాలో ప‌డింది. అదే టైంలో పెద‌కూర‌పాడు వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంక‌ర్రావుతో పాటు ఈ ప్రాంతానికి చెందిన మిగిలిన పార్టీల నేత‌లు ఈ విష‌యంలో బుగ్గ‌న బెల్లం పెట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో మైన‌స్ అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: